యువరాజ్ 6 సిక్సర్లకు కారణం నేనే: ఫ్లింటాఫ్ పశ్చాత్తాపం

2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ సృష్టించిన ఆరు సిక్సర్ల విధ్వంసం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని ఘట్టం.;

Update: 2025-10-24 16:47 GMT

2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ సృష్టించిన ఆరు సిక్సర్ల విధ్వంసం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని ఘట్టం. ఆ చారిత్రాత్మక ఘనత వెనుక అసలు రహస్యాన్ని ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తాజాగా బయటపెట్టారు. యువీ ఆరు సిక్సర్లు బాదడానికి తానే కారణమంటూ ఆయన పశ్చాత్తాప్పడ్డారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫ్లింటాఫ్‌, ఆ మ్యాచ్‌లో యువరాజ్‌తో జరిగిన వాగ్వాదాన్ని గుర్తు చేసుకున్నారు. "ఆ మ్యాచ్‌లో యువరాజ్‌తో నాకొక చిన్న గొడవ జరిగింది. నేను కొంచెం అతిగా మాట్లాడేశా... లైన్ క్రాస్ చేశా. దాంతో యువీ ఫైర్ అయ్యాడు. అతడిని రెచ్చగొట్టడం నా తప్పే" అని ఫ్లింటాఫ్ అంగీకరించారు.

ఫ్లింటాఫ్ మాటలతో రెచ్చిపోయిన యువరాజ్ సింగ్, తర్వాతి ఓవర్‌లోనే ఇంగ్లాండ్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. ఆ అద్భుత ఘట్టాన్ని వివరిస్తూ, ఫ్లింటాఫ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"యువరాజ్ రెచ్చిపోయి బ్రాడ్ బౌలింగ్లో 6 సిక్సర్లు కొట్టాడు. వాస్తవానికి ఆ ఓవర్‌ బ్రాడ్ స్థానంలో నేనే వేయాల్సింది, కానీ అప్పుడు బ్రాడ్ బౌలింగ్ చేశాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న నన్ను చూస్తూ యువీ ప్రతి సారి బంతిని సిక్సర్‌గా బాదాడు" అని నవ్వుతూ చెప్పారు.

యువీ ఐదో సిక్స్ కొట్టిన తర్వాత తన మనసులో కలిగిన భావనను కూడా ఫ్లింటాఫ్ పంచుకున్నారు. "అతడు ఐదో సిక్స్ కొట్టగానే, మనసులో 'ఇంకోటి కూడా కొట్టు రా' అని నేనూ కోరుకున్నా! ఎందుకంటే ఆ క్షణం అంత అద్భుతంగా ఉంది. ఆ రోజు క్రికెట్‌ చరిత్రలో ఒక అజరామరమైన క్షణం సృష్టించబడింది" అని ఆయన జోడించారు.

స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, టీ20 క్రికెట్‌లో ఈ అరుదైన రికార్డును సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఫ్లింటాఫ్ తన వ్యాఖ్యలను ముగిస్తూ "యువరాజ్‌ను రెచ్చగొట్టడం నా తప్పే... కానీ, అతడి ప్రతిస్పందన మాత్రం అద్భుతం!" అంటూ ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సన్నివేశాన్ని ఇప్పటికీ అభిమానులు మరిచిపోలేదు.

యువరాజ్ సింగ్ ఆ రోజు కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు చేసి, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన రికార్డును కూడా నెలకొల్పాడు.


Full View


Tags:    

Similar News