రీల్ సీన్ కాదు.. హెలికాఫ్టర్ లో వచ్చి ఓటేసి వెళ్లిన లూలూ ఛైర్మన్
ఇప్పుడు చెప్పేది రీల్ సీన్ కాదు రియల్ సీన్. సినిమాల్లో మాత్రమే ఈ తరహా సన్నివేశం కనిపించే ఉదంతం ఈసారి రియల్ లైఫ్ లో పలుకరించి.. అందరూ ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేసింది.;
ఇప్పుడు చెప్పేది రీల్ సీన్ కాదు రియల్ సీన్. సినిమాల్లో మాత్రమే ఈ తరహా సన్నివేశం కనిపించే ఉదంతం ఈసారి రియల్ లైఫ్ లో పలుకరించి.. అందరూ ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేసింది. కేరళకు చెందిన లూలూ గ్రూపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ హైపర్ మాల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే లూలూ గ్రూపు భారత్ లోనే కాదు.. విదేశాల్లోనూ తన సత్తా చాటటం తెలిసిందే. ఈ గ్రూపు ఛైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ అన్నది తెలిసిందే. ఆయన తీరు.. ఆయన తీసుకునే నిర్ణయాలు అందరిని ఆకర్షించటమే కాదు.. ఆయనకు అభిమానిలా మార్చేస్తుంటాయి.
ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నప్పటికి చాలా చిన్న విషయాలకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత చూసినప్పుడు ఆయన మిగిలిన వారికి భిన్నంగా కనిపిస్తుంటారు. అలాంటి తీరును మరోసారి ప్రదర్శించారు. ఆయన స్వస్థలం కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా నట్టికా అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్రంలో జరుగుతన్న పంచాయితీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రైవేటు జెట్ లో వచ్చి.. అక్కడి నుంచి ఊరికి హెలికాఫ్టర్ లో వచ్చి ఓటేసి వెళ్లిన వైనం చూస్తే వావ్ అనుకోకుండా ఉండలేరు.
ఈ మధ్యన థాయ్ లాండ్ లో పర్యటించిన లూలూ ఛైర్మన్ యూసఫ్ అలీ.. అక్కడి మంత్రితో భేటీ అయి.. వ్యాపార విస్తరణ అంశాల్ని చర్చించారు. కట్ చేస్తే.. తన ఊళ్లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆయన త్రిస్సూరుకు బయలుదేరారు. ప్రైవేటు జెట్ లో కొచ్చికి వచ్చిన ఆయన.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో తన ఊరైన నట్టికాకు చేరుకున్నారు.
తన ఓటుహక్కును వినియోగించుకోవటం కోసం తాను చదువుకున్న స్కూల్ లోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటంతో అక్కడికి వచ్చి ఓటేశారు. ఆసక్తికర మరో అంశం ఏమంటే.. తాను ఓటు వేసే సమయంలో సంప్రదాయ వస్త్రాల్లోనే పోలింగ్ కేంద్రానికి రావటం విశేషం. ఓటు వేసిన తర్వాత స్థానికుల్ని పలుకరించారు. దీంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఓటు వేసేందుకు ఇదే తరహాలో వచ్చారు. కేరళలో రెండు దశల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్నటితో (డిసెంబరు 11) రెండో దశ పోలింగ్ ముగిసింది. వీటి ఫలితాలు డిసెంబరు 13న (శనివారం) వెల్లడి కానున్నాయి. కేరళలో జరిగిన స్థానిక ఎన్నికలు రెండు దశల్లో కలిపి 73.69 శాతం నమోదైనట్లుగా అక్కడి ఎన్నికల అధికారులు చెబుతున్నారు.