భారత్ పై పడి ఏడుస్తున్న ఇంకిలాబ్ మోంచో.. 4 డిమాండ్లు జరిగే పనేనా!
ఈ సందర్భంగా ఇంకిలాబ్ మోంచో చేసిన నాలుగు డిమాండ్లు ఈ విధంగా ఉనాయి..!;
పాముకు పాలు పోసినా విషయమే కక్కుతుందని అంటారు.. చెప్పిన మాట వింటుందనో, బూర ఊదితే డ్యాన్స్ చేస్తుందనో, తనకు కష్టం వచ్చినప్పుడు తోడు ఉంటుందనో పామును పెంచుకుంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదని చెబుతారు. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి రాజకీయ సలహాదారుడిగా ఉన్న యూనస్ పెంచి పోషించినట్లు చెబుతున్నా ఇంకిలాబ్ మోంచో సంస్థ నుంచి ఇప్పుడు ఆయనకు ఓ అల్టిమెటం జారీ అయ్యింది.
అవును... మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ను పదవీచిత్యురాలిని చేయడమే లక్ష్యంగా జరిగిన ఘటనలో కీలక భూమిక పోషించిన ఇంకిలాబ్ మోంచో సంస్థ.. యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. భారత వ్యతిరేక విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హైదీ హత్య తర్వాత తీవ్రంగా రియాక్ట్ అవుతున్న ఆ సంస్థ ఇంకిలాబ్ మోంచో.. ప్రభుత్వం ముందు నాలుగు కీలక డిమాండ్లు ఉంచింది.
ఇందులో ఒకదానికి 24 గంటలు మాత్రమే టైం ఇవ్వగా.. మరోదానికి మాత్రం 24 రోజులు గడువివ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో 24 గంటల తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. కాగా.. ఇంకిలాబ్ మోంచో సంస్థ యూనస్ మద్దతుతోనే అభివృద్ధి చెందిందని అంటారు! దీనికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెబుతుంటారు!
ఈ సందర్భంగా ఇంకిలాబ్ మోంచో చేసిన నాలుగు డిమాండ్లు ఈ విధంగా ఉనాయి..!
1. ఉస్మాన్ హైదీని చంపిన హంతకులు, ఆ హత్యకు పథకం వేసినవారు, ఆ హత్యకు సహకరించిన వారు, తప్పించుకున్నవారికి ఆశ్రయం కల్పించినవారు సహా మొత్తం హత్యకు సమంధించిన ముఠాను 24 రోజుల్లోగా చట్టం ముందు నిలబెట్టాలి.
2. ఉస్మాన్ హైదీ హంతకులను రాబోయే 24 గంటల్లో తిరిగి ఇవ్వకపోతే.. భారతదేశంలో వారి ఆశ్రయం గురించి నిర్దిష్ట ప్రకటన రాకపోతే.. దేశంలోని భారతీయుల పని అనుమతులను రద్దు చేయాలి.
3. అక్కడ ఆశ్రయం పొందిన హంతకులను భారతదేం తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే.. ఆ దేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు దాఖలు చేయాలి.
4. సివిల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ లో దాక్కున్న ఫాసిస్ట్ నేరస్థులను గుర్తించి, అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి.
ఇందులో మొదటి డిమాండ్ సంగతి కాసేపు పక్కన పెడితే.. మిగిలిన మూడు డిమాండ్లకు కారణం ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ఇటీవల చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ఉస్మాన్ హైదీ హత్యలో ప్రధాన అనుమానితులుగా ఉన్న ఇద్దరు మేఘాలయకు అనుసంధానించబడిన మైమెనింగ్ జిల్లాలోని హాలుఘాట్ సరిహద్దు గుండా భారత్ లోకి పారిపోయారని ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
ఇలా ఉస్మాన్ హైదీ హంతకులు భారత్ కు పారిపోయారనే బంగ్లాదేశ్ పోలీసుల ఆరోపణలను సరిహద్దు భద్రతా దళం (బీ.ఎస్.ఎఫ్.) తోసిపుచ్చింది. అలాంటి సరిహద్దు కదలికలకు ఎలాంటి ఆధారాలు లేవని.. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని బీ.ఎస్.ఎఫ్. అధికారులు తెలిపారు. అయినప్పటికీ.. నిందితులను పట్టుకోలేక, బంగ్లాదేశ్ పోలీసులు ఆ నెపాన్ని భారత్ పైవేసి పబ్బం గడుపుకునే పనికి పూనుకుంటున్నారు.. ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నారు!