వైసీపీ గ్రాఫ్ డౌన్ ...యువ నేతకు చెక్ పడుద్ది ?
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి 2024 ఎన్నికలు అసలు కలిసి రాలేదని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే బోణీ కూడా కొట్టకుండా బోల్తా పడింది.;
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి 2024 ఎన్నికలు అసలు కలిసి రాలేదని చెప్పాల్సి ఉంది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇక్కడ ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచింది... అసలే టీడీపీకి బలం ఉంది, ఆపై జనసేన బలం తోడు అయింది, బీజేపీ ప్రభావం కూడా గట్టిగా పడింది. దాంతో వైసీపీకి ఎదురీతగానే పరిస్థితి ఉంది. ఓటమి చెంది ఏణ్ణర్ధానికి దగ్గర పడుతున్నా వైసీపీ గేర్ మార్చలేదు, స్పీడ్ పెంచలేదు, దానికి కారణం బలహీనంగా మారిన నేతలు అని అంటున్నారు.
హైకమాండ్ ఫోకస్ పెట్టినా :
విశాఖ జిల్లా మీద వైసీపీ ఎపుడూ ఫోకస్ పెడుతుంది, ఎందుకంటే ఇక్కడ కూటమి బలం ఎక్కువ కాబట్టి. అంతే కాదు కీలకమైన నియోజకవర్గాల్లోనూ నేతలను సమాయత్తం చేస్తుంది. జనంతో మమేకం కావాలని దిశా నిర్దేశమూ చేస్తుంది. అయితే ఈ మాటలను చాలా మంది వైసీపీ ఇంచార్జిలు లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో జెండా ఎగరేసిన చోట ఇపుడు ఫ్యాన్ పార్టీ కృంగి పోవాల్సి వస్తోంది. అంతే కాదు, సరైన నాయకత్వ పటిమ చూపించలేని నేతలకు చెక్ తప్పదని కూడా హైకమాండ్ హెచ్చరిస్తోంది.
చతికిలపడ్డ వైనం :
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైనది. ఇక్కడ నుంచి ఎందరో ఉద్ధండులు గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. అలాంటి చోట 2019 ఎన్నికల్లో కేవలం ముప్పయ్యేళ్ళకే మ్మెల్యే అయ్యారు అదీప్ రాజ్. ఆయన వైసీపీ నుంచి గెలిచి అప్పటికి సీనియర్ నేతగా ఉంటూ రాజకీయంగా ఢక్కామెక్కెలె తిన్న మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని ఏకంగా 30 వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓడించేశారు. ఇక తనకు తిరుగే లేదనుకుని ఆయన పార్టీని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. 2024 లో ఆయనకు టికెట్ రాదు అనే అనుకున్నారు కానీ వైసీపీ ఇచ్చింది అయితే కూటమి జోరులో ఆయన ఓటమి పాలు అయ్యారు.
వర్గ పోరు ఉన్నా కూడా :
ఇక వైసీపీ ఓడాక అదీప్ రాజ్ పెద్దగా నియోజకవర్గం గురించి పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. ఆయనను తప్పించాలని కూడా క్యాడర్ కోరుతోంది. ఒక వైపు చూస్తే కూటమిలో కుమ్ములాటలు ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు టీడీపీ ఇంచార్జి గా ఉన్న గండి బాబ్జీకి అసలు పడటం లేదు, ఇద్దరూ వర్గాలుగా మారి కూటమిలోనే పోరాటం చేస్తున్నారు నిజానికి ఈ సమయంలో బలంగా మారాల్సింది వైసీపీ. కానీ అదీప్ రాజ్ ఆ రకమైన రాజకీయ చొవరను చూపించలేకపోతున్నారు అన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దాంతో అక్కడ బలమైన నేత కోసం వైసీపీ అన్వేషణ ప్రారంభించింది అని అంటున్నారు సరైన నేత కనుక దొరికితే మాత్రం యువనేతకు చెక్ పెట్టడం ఖాయమని అంటున్నారు.