వైసీపీకి ఉండవల్లి డైరెక్షన్ ?

ఇక వైసీపీ ఇపుడు ప్రతిపక్షంలో ఉంది. దాంతో పాటు జగన్ కి ఇపుడు వైసీపీని బాగా పైకి లేపాల్సిన అవసరం ఉంది.;

Update: 2025-08-23 16:30 GMT

వైసీపీ అధినేత జగన్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అని గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిలాకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు రాజమండ్రి జైలులో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిన్ ములాఖత్ ద్వారా పరామర్శించి వచ్చినపుడు అదే రాజమండ్రి లో ఉన్న ఉండవల్లి నివాసానికి వెళ్ళి చాలా సేపు చర్చలు జరిపారు. అవి రాష్ట్ర రాజకీయాలలో సైతం ఆసక్తిని పెంచాయి.

సాదరంగా స్వాగతం :

ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ మేధావి. వైఎస్సార్ కి అత్యంత సన్నిహిత నేత. కాంగ్రెస్ భావజాలం నిండా ఉన్న వారు. ఏపీలో కాంగ్రెస్ ఎటూ లేదు కాబట్టి వైసీపీకి మద్దతుగా ఉండవల్లిని రంగంలోకి దించాలని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారుట. ఇదే విషయం ఉండవల్లి వద్ద వారు అంతా ప్రస్తావించారని అంటున్నారు. అయితే ఉండవల్లి ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు అని అంటున్నారు. తన వయసుని తన అసక్తతను ఆయన వారి ముందు ఉంచి నో చెప్పారని ప్రచారం సాగుతోంది.

సలహాదారుగా ఉంటూ :

అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండవల్లి వచ్చి నేరుగా పాల్గొనాల్సిన అవసరం లేదని పార్టీ అభ్యున్నతి కోసం మరోసారి ఏపీలో అధికారం చేపట్టేందుకు వీలుగా సరైన సలహాలూ సూచనలు పార్టీకి ఇచ్చినా అది కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారని అంటున్నారు. అయితే దీని మీద ఉండవల్లి ఏమన్నారు అన్నది తెలియడం లేదు. చెప్పాలంటే ఇవన్నీ ప్రచారంగానే ఉన్నాయి.

బోలెడు మంది ఉద్ధండులు :

వైఎస్ జగన్ కి సలహాలు కావాల్సి వస్తే ఇచ్చేందుకు బోలెడు మంది ఉద్ధండులు ఉన్నారని అంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వంలో సైతం సలహాదారులుగా అనేకమందిని నియమించారు. వారి సంఖ్య ఒక దశలో వందకు మించి ఉందని కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఇంతమంది సలహాదారులు ఉన్నా ఏవరూ ప్రభుత్వ విధానాలు తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి పెద్దగా సలహాలూ సూచనలూ ఇవ్వలేదని అయిదేళ్ళ పాలన తీరుని చూసిన వారు చెప్పే మాట. అయితే సలహాలు ఇచ్చినా ప్రభుత్వంలోని వారు ఆనాడు తీసుకోలేదని ఆ తరువాత సలహాలు ఇవ్వడం అన్నది కూడా పెద్దగా అవసరం లేకుండా పోయిందని కధనాలు వినవచ్చాయి.

జగన్ పాటిస్తారా :

ఇక వైసీపీ ఇపుడు ప్రతిపక్షంలో ఉంది. దాంతో పాటు జగన్ కి ఇపుడు వైసీపీని బాగా పైకి లేపాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో పార్టీని పెంచాలంటే సరైన సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అందుకే ఉండవల్లి వంటి రాజకీయ మేధావి పక్కన ఉంటే బాగుంటుంది అన్నది వైసీపీలో కొందరు నాయకుల భావన. అయితే జగన్ ఉండవల్లి వంటి వారి సలహాలను ఏ మేరకు తీసుకుంటారు అన్నదే చర్చగా ఉంది. ఇక ఉండవల్లి సితం తన సలహాలు ఎవరికి అవసరం అన్న ఆలోచనలోనే ఉంటూ రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తారు అని అంటున్నారు. మొత్తానికి ఉండవల్లి కనుక వైసీపీకి ముఖ్య సలహాదరుడిగా మారితే అది అతి పెద్ద రాజకీయ సంచలనమే అవుతుంది. చూడాలి అలా జరుగుతుందా లేదా అన్నది.

Tags:    

Similar News