బెయిల్ కండీషన్లపై చంద్రబాబు బరితెగింపు.. సీఎంపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మీడియా సమావేశం పెను దుమారం రేపుతోంది.;

Update: 2025-12-04 10:12 GMT

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మీడియా సమావేశం పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు అంశాల్లో ఆయన చేసిన విమర్శలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి కేసులను చంద్రబాబు అడ్డదారుల్లో, దొంగచాటుగా ఎత్తివేయించుకుంటున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎంను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. జగన్ విమర్శల వీడియోలను వైసీపీ వైరల్ చేస్తోంది.

2014-19 మధ్య అనేక అవినీతి కార్యాకలాపాలకు ఒడిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు కూటమి పాలనలో ఆ కేసులను మాఫీ చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. అవన్నీ ఆషా మాషీ కేసులు కావని మండిపడ్డారు. చంద్రబాబుపై నమోదైన స్కిల్ కుంభకోణం కేసును కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందని మరోసారి గుర్తు చేశారు జగన్. ఈ స్కాంలో చంద్రబాబు ప్రోత్సాహంతో నిందితులు రూ.370 కోట్లు షెల్ కంపెనీలకు తలించారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు.

అదేవిధంగా చంద్రబాబు బినామీ పేర్లతో అమరావతిలో భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. అమరవతిలో భూ కొనుగోళ్లపై నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. వివిధ కేసుల్లో బెయిలు మీద ఉన్న చంద్రబాబు.. బెయిలు షరతులు ఉల్లంఘిస్తూ బరి తెగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిపై గతంలో ఫిర్యాదుచేసిన అధికారులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. అబద్దపు వాంగ్మూలాలు ఇప్పించి తనపై నమోదైన కేసులను దొంగ చాటుగా ఎత్తివేయించుకుంటున్నారని జగన్ ఆక్షేపించారు.

‘‘చంద్రబాబు ఎన్నిన్ని దుర్మాగాలు చేస్తున్నారు. సందట్లో సడేమియాలా తనపై ఉన్న అవినీతి కేసులను దొంగ చాటుగా క్లోజ్ చేయించుకుంటున్నాడు. ఇది బెయిల్ కండీషన్లను అతిక్రమించడం కాదా? అని అడుగుతున్నా.. బెయిలుపై ఉన్న వ్యక్తి కేసులను క్లోజ్ చేయించుకోవడమేంటి? తానే దొంగ, తానే పోలీస్, తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్, తానే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి, తనమీద కేసులను విత్డ్రా చేసుకుంటున్నాడు. దీనిని ఏమనాలి. కళ్లముందే మీ బరితెగింపు కనిపిస్తోంది.’’ అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన పలుకేసులను సీఐడీ వెనక్కి తీసుకుంటోంది. ఇందులో ప్రధానమైనది ఏపీ ఫైబర్ నెట్ కేసు కాగా, మరొకటి రాజధానిలో అసైన్డ్ భూముల సమీకరణ.. ఇలా గత ప్రభుత్వం నమోదు చేయించిన కేసులకు తగిన ఆధారాలు లేవని కేసుల ఉపసంహకరణ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల కొద్ది రోజుల క్రితమే మీడియా ముఖంగా అభ్యంతరం తెలిపారు. తాజాగా జగన్ కూడా తన మీడియా సమావేశంలో చంద్రబాబు కేసులనే హైలెట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

Tags:    

Similar News