బాలయ్యకు జగన్ వరం.. హిందూపురంలో ఇక అన్ స్టాపబుల్!

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-07-17 10:02 GMT

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 1983 నుంచి టీడీపీకి కంచుకోట వంటి హిందూపురంలో వైసీపీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. అయితే నేతల మధ్య భేదాభిప్రాయాలను చక్కదిద్ది పార్టీని బలోపేతం చేయాల్సిన వైసీపీ అధినేత, అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హిందూపురంలో టీడీపీకి చిరకాల ప్రత్యర్థిగా పోరాడుతున్న నవీన్ నిశ్చల్, ఆయన అనుచరుడు వేణుగోపాలరెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో వైసీపీ సమన్వయకర్త దీపికకు లైన్ క్లియర్ చేసినట్లు వైసీపీ భావిస్తున్నా, ఈ పరిణామం టీడీపీకి ముఖ్యంగా సినీనటుడు ఎమ్మెల్యే బాలకృష్ణకు కలిసివస్తుందన్న విశ్లేషణలే వ్యక్తమవుతున్నాయి.

హిందూపురంలో బాలకృష్ణ మూడుసార్లు గెలిచారు. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా చెబుతారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హిందూపురంలో పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి ఆయన హిందూపురంనే తన కోటగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ వరుసగా మూడుసార్లు, ఆయన తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ఒక సారి, ఆ తర్వాత బాలకృష్ణ మూడు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. మధ్యలో 1999 నుంచి 2009 ఎన్నికల వరకు మూడుసార్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కాకుండా, స్థానిక నేతలకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఇక 2014లో బాలకృష్ణ ఆరంగేట్రం చేశాక హిందూపురం ఆయన అడ్డాగా మారింది. ఇదే సమయంలో 2004 నుంచి స్థానిక నేత నవీన్ నిశ్చల్ టీడీపీకి గట్టిపోటీనిస్తూ వచ్చారు. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయనను 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. బాలయ్యపై పోలీసు అధికారి ఇక్బాల్ ను పోటీకి పెట్టింది వైసీపీ. అదేవిధంగా 2024 ఎన్నికల్లో సైతం నవీన్ నిశ్చల్ ను కాదని తిప్పేగౌడ నారాయణ్ దీపిక అనే మహిళా నేతను రంగంలోకి దింపింది.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్బాల్ ను ఎమ్మెల్సీ చేస్తే, ఆయన గత ఎన్నికల ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేసమయంలో టికెట్ నిరాకరించినా టీడీపీ వ్యతిరేక భావజాలంతో నవీన్ నిశ్చల్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్ కు హిందూపురంలో గట్టి పట్టు ఉంది. అయితే టీడీపీ బలం, నందమూరి కుటుంబ ప్రభావంతో ఆయన నెగ్గుకురాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఉంటే తమకు గుర్తింపు ఉండదన్న కారణంగా వైసీపీలో ఆయన ప్రత్యర్థులు నవీన్ నిశ్చల్ కు పొగబెట్టారని అంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించలేదని నవీన్ నిశ్చల్ పై దీపిక వర్గం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏడాదిగా హిందూపురంలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయిందని అంటున్నారు.

ఇక ఈ నెల 8న జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతి వేడుకల్లో ఈ విభేదాలు మరోమారు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వైఎస్ జయంతి కార్యక్రమంలో ప్రకటించడంతో దీపిక వర్గం షాక్ తిన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకుని, అలాంటి ప్రకటనలు చేయొద్దని నవీన్ నిశ్చల్ ను సర్ది చెప్పాల్సిన వైసీపీ అధిష్టానం ఏకంగా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి ఏ మాత్రం బలం లేని హిందూపురం వంటి నియోజకవర్గాల్లో సీనియర్లను కాపాడుకుంటూ బలం పుంజుకోవాల్సింది పోయి ఇలా బటయకు పంపడంపై కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ప్రత్యర్థి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కలిసివస్తుందని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు. తనకు ప్రత్యర్థులే లేకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ను పార్టీలో చేర్చుకున్న బాలకృష్ణ... నవీన్ నిశ్చల్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. హిందూపురం నియోజకవర్గంలో పార్టీ ఇప్పటికే బలంగా ఉందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి శిబిరం నుంచి ప్రధాన నేతలు వస్తే ఎవరైనా కాదంటారా? అని అంటున్నారు. అయితే తన రాజకీయ జీవితం మొత్తం టీడీపీపై పోరాడటానికే కేటాయించిన నవీన్ నిశ్చల్.. ఇప్పుడు భవిష్యత్తు కోసం టీడీపీతో చేతులు కలుపుతారా? లేక జనసేన, బీజేపీల్లో చేరతారా? అనేది చర్చకు తావిస్తోంది. మూడు పార్టీల్లో ఎటువైపు ఆయన మొగ్గినా వైసీపీకి మరింత ఇబ్బందే అంటున్నారు. ఇదే సమయంలో బాలయ్యకు అంతా కలిసివచ్చినట్లేనని అంటున్నారు.

Tags:    

Similar News