వైసీపీ సోషల్ మీడియా హ్యాక్: మళ్లీ భార్గవ్ రెడ్డి ఎంట్రీ ఇవ్వాలా? నెట్టింట హాట్ టాపిక్

ప్రస్తుతం నెటిజన్లు, పార్టీ మద్దతుదారుల మధ్య ఒకే ఒక చర్చ నడుస్తోంది.. "వైసీపీ సోషల్ మీడియా మళ్లీ పూర్వవైభవం సాధించాలంటే సజ్జల భార్గవ్ రెడ్డి మళ్లీ బాధ్యతలు చేపట్టాల్సిందేనా? అన్న చర్చ సాగుతోంది.

Update: 2026-06-16 08:30 GMT

అధికారం పోయాక అగ్రెసివ్నెస్ పోయింది.. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టడం మరచిపోయి అకౌంట్‌నే పోగొట్టుకున్నారా? వైసీపీ సోషల్ మీడియాకు పట్టిన ‘హ్యాకింగ్’ గ్రహణాన్ని వీడించాలంటే.. మళ్లీ ఆ ‘భార్గవ’ రాముడే రావాలా? ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఇటీవల జరిగిన ఒక పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురికావడం.. అందులో హ్యాకర్లు అసభ్యకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడంతో మెటా యాజమాన్యం ఆ పేజీని బ్లాక్ చేసింది. ఈ ఘటన పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా వైసీపీ సోషల్ మీడియా విభాగ నిర్వహణలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం నెటిజన్లు, పార్టీ మద్దతుదారుల మధ్య ఒకే ఒక చర్చ నడుస్తోంది.. "వైసీపీ సోషల్ మీడియా మళ్లీ పూర్వవైభవం సాధించాలంటే సజ్జల భార్గవ్ రెడ్డి మళ్లీ బాధ్యతలు చేపట్టాల్సిందేనా? అన్న చర్చ సాగుతోంది.

భద్రతా లోపాలా? నిర్లక్ష్యమా?

సాధారణంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలకు అత్యున్నత స్థాయి భద్రత ఉండాలి. కానీ తాజా హ్యాకింగ్ ఘటన చూస్తుంటే అడ్మిన్లు కనీస జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అడ్మిన్లలో ఎవరో ఒకరు అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం... సిస్టమ్ లేదా అకౌంట్ పాస్‌వర్డ్‌లను చాలా సాదాసీదాగా ఉంచడం... టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వంటి ప్రాథమిక భద్రతా ప్రమాణాలను ఎనేబుల్ చేయకపోవడం.. ఇలాంటి సాంకేతిక నిర్లక్ష్యం వల్లే లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న అధికారిక పేజీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందని.. ఇది పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2014-19 వైభవం.. ఆ తర్వాత మందగమనం

వైసీపీ 2014 నుండి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని సోషల్ మీడియా వింగ్ అత్యంత 'ఆర్గానిక్'గా పకడ్బందీగా పనిచేసింది. అప్పట్లో ప్రత్యర్థులపై డిజిటల్ వేదికలపై వైసీపీ సాధించిన పైచేయి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో ఆ పాత దూకుడు కనిపించలేదు. ప్రభుత్వంలో బిజీ అయిపోవడం వల్లో..లేదా సరైన లీడర్‌షిప్ లేకపోవడం వల్లో కానీ డిజిటల్ వేదికలపై పార్టీ పట్టు సడలిందనేది వాస్తవం.

భార్గవ్ రెడ్డి హయాం.. అగ్రెసివ్ పాలిటిక్స్

ఈ క్రమంలోనే సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను స్వీకరించారు. ఆయన ఎంట్రీతో సీన్ పూర్తిగా మారిపోయింది. భార్గవ్ రెడ్డి తన టీమ్‌తో కలిసి సోషల్ మీడియాను అత్యంత వ్యూహాత్మకంగా, అగ్రెసివ్‌గా మార్చారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం .. "భార్గవ్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా సైన్యం క్షణం కూడా ఆలస్యం చేయలేదు. టెక్నికల్ సెక్యూరిటీతో పాటు పొలిటికల్ కౌంటర్లలోనూ ఆయన టీమ్ పర్ఫెక్ట్ సిస్టమాటిక్ అప్రోచ్‌ను ఫాలో అయ్యింది. అయితే ఇటీవల ప్రభుత్వం దిగిపోయిన తర్వాత భార్గవ్ రెడ్డి, ఆయన కోర్ టీమ్ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వారు పక్కకు తప్పుకున్న కొద్ది రోజులకే ఇలాంటి భారీ భద్రతా లోపం జరగడం.. ఏకంగా ఫేస్‌బుక్ పేజీనే కోల్పోవాల్సి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మళ్లీ భార్గవ్ రెడ్డి రావాలా?

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఒకే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ భార్గవ్ రెడ్డినే రంగంలోకి దించాలని కోరుతున్నారు. ఆయన వస్తేనే సోషల్ మీడియా మళ్లీ గాడిలో పడుతుందని.. ప్రత్యర్థులకు గట్టి కౌంటర్లు ఇవ్వడం సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నారు.

వ్యక్తుల మార్పు కంటే సోషల్ మీడియా నిర్వహణకు బలమైన సైబర్ భద్రతా వ్యవస్థలు అవసరమని నిపుణులు చెబుతున్నప్పటికీ రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు నడపడానికి సమర్థుడైన లీడర్ అవసరం. మరి ఈ సంక్షోభం నేపథ్యంలో వైసీపీ అధిష్టానం సోషల్ మీడియా బాధ్యతలను మళ్లీ భార్గవ్ రెడ్డికి అప్పగిస్తుందా? లేక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుందా? అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News