బిలబిలమంటూ వచ్చారు... మళ్ళీ అంతేనా ?
ఇక వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మీద భారీ ర్యాలీని రాష్ట్రవ్యాప్త్నగా తాజాగా చేపట్టింది. విశాఖ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరిగింది.;
వైసీపీలో చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. పార్టీలో నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారు ఆయా సామాజిక వర్గాలలో మంచి పలుకుబడి కలిగిన వారుగా ఉన్నారు. వీరంతా వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఎన్నో కీలకమైన పదవులు కూడా చేపట్టారు. అయితే పార్టీ ఓటమి పాలు కాగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దాంతో గత ఏడాదిన్నర కాలంగా వీరు ఎక్కడ ఉన్నారు, ఏమై పోయారు అన్న చర్చ పార్టీ లోపలా బయటా సాగింది. వీరిలో చాలా మందికి పార్టీ పదవులు ఇచ్చి అధినాయకత్వం బాధ్యతలు అప్పగించినా కూడా వారు ఎందుకో మౌన ముద్రనే దాలుస్తూ అలా ముందుకు సాగుతున్నారు.
కోటి అంటే కో అంటూ :
ఇక వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మీద భారీ ర్యాలీని రాష్ట్రవ్యాప్త్నగా తాజాగా చేపట్టింది. విశాఖ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో అనేకమంది పార్టీ నేతలు కనిపించారు. వీరంతా పార్టీ ఓటమి తరువాత ఎపుడూ పెద్దగా కనిపించని వారు కావడం విశేషం. మరి వీరంతా బిలబిలమంటూ ర్యాలీలో పాల్గొంటూ జోష్ పెంచారు. ఒక విధంగా నాయకులు అంతా అటెండ్ కావడంతో వైసీపీ ర్యాలీ సక్సెస్ అయింది అనే అంటున్నారు.
శుభారంభమేనా :
ఇక ఈ విధంగా మరుగున ఉన్న నాయకులు అంతా పార్టీ ర్యాలీలో కనిపించడంతో క్యాడర్ లో సైతం హుషార్ వచ్చింది అయితే ఇదే ఊపుతో ఈ నాయకులు ఇక మీదట రెగ్యులర్ గా కనిపిస్తారా లేక ఇక్కడితే ఈ ఉత్సాహం ఆపుకుంటారా అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి పార్టీ పదవులు ఇచ్చినా గమ్మున ఉన్న నాయకులు అంతా ఇపుడు చప్పున బయటకు వచ్చారు. ఎందుకు వీరు ఇపుడు కనిపిస్తున్నారు అన్నది కూడా మరో చర్చగా ఉంది.
బలంగా నిలబడితేనే :
అయితే ఇటీవల కాలంలో వైసీపీ అధినాయకత్వం హెచ్చరిస్తోంది. పార్టీలో సైలెంట్ గా ఉండే వారికి అవకాశాలు ఇవ్వమని కూడా స్పష్టంగా చెబుతోంది. దాంతో ఈ విధంగా బయటకు వచ్చారా అన్నది కూడా డిస్కషన్ గా ఉంది. అయితే నాయకులు అంతా కలసి ఇప్పటి నుంచి జనంలో ఉండకపోతే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముందు ఉన్నాయి. దాంతో పాటుగా పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో పాత నాయకులు అంతా ఒక్కసారిగా బయటకు రావడం మంచిదే కానీ ఇదే స్పూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ కధ మామూలుగానే ఉంటుందని అంటున్నారు.