'బాబూస్' రీకాలింగ్ సరే.. మనమేంటి.. జగనన్నా ..!
''రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో'' పేరుతో వైసీపీ అధినేత జగన్ ఇంటింటి ప్రచారానికితెరదీశారు.;

''రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో'' పేరుతో వైసీపీ అధినేత జగన్ ఇంటింటి ప్రచారానికితెరదీశారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. తద్వారా 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసి.. నిలదీయాలన్న లక్ష్యంతో జగన్ రాజకీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ప్రజలు వైసీపీవైపు మొగ్గు చూపుతారో లేదో తెలియదు కానీ.. చంద్రబాబుపై వ్యతిరేకత పెంచుకుంటారన్నది జగన్ వ్యూహం.
బాగానే ఉంది. అయితే.. వైసీపీకి రీకాలింగ్ అవసరం లేదా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ప్రజల్లో చంద్రబా బుపై వ్యతిరేకత పెంచినంత మాత్రాన అది వైసీపీకి సానుకూలంగా మారుతుందన్న సంకేతాలు ఇస్తున్నది అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ జగన్ అనుకున్నట్టుగా కాకుండా.. ఈ వ్యతిరేకత అటు పవన్ కో.. లేక కాంగ్రెస్‌కో అనుకూలంగా మారితే.. అప్పుడు వైసీపీ ఏం చేయాలన్నది కూడా ప్రశ్న. కాబట్టి.. రీకాలింగ్ విషయంలో ముందు సొంత పార్టీపైనే జగన్ దృష్టి పెడితే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
1) నాయకుల్లో ఉన్న అసంతృప్తి: వైసీపీ అధినేతపై ఏడాది కిందట ఎలాంటి అసంతృప్తి నాయకుల్లో పెరిగిందో ఇప్పుడు కూడా అంతే అసంతృప్తి ఉందనేది వాస్తవమని పరిశీలకులు చెబుతున్నారు. నియోజకవర్గాల మార్పు కావొచ్చు. అధినేత తమకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా.. అవమానించడం కావొచ్చు. తాడేపల్లిలో అధికారం ఒక్కరి చేతిలోనే ఉంచడం కావొచ్చు. ముందు వీటి నుంచి జగన్ బయట పడాలి.
2) కార్యకర్తలకు ప్రాధాన్యం: ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ మరిచిపోయిన ప్రధాన అంశం. దీని నుంచి బయట పడతామని.. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని జగన్ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో దానిపై ఇంకా సందేహాలు ఉన్నాయి. సో.. దీనిపైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకుని రీకాల్ చేసుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
3) రాజధాని, అభివృద్ధి: ఈ రెండు అంశాలే గత ఎన్నికల్లో వైసీపీకి పెద్ద మైనస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి విషయంలోను.. రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ..జగన్ ఒక క్లారిటీ ఇచ్చి.. గతాన్ని గుర్తు చేసుకుని ప్రజల మధ్యకు వస్తే బెటర్ అని చెబుతున్నారు. ఈ రీకాలింగ్ వైసీపికి అవసరమన్నది మెజారిటీ నాయకుల వాదన.