రోడ్డెక్కిన వైసీపీ...వ్యూహం అదేనా ?
ఏ రాజకీయ పార్టీ అయినా సంస్థాగత బలంతోనే ముందుకు సాగుతుంది. ఆ విధంగా చూస్తే వైసీపీకి అదే బలహీనంగా మారి 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది.
రెండేళ్ళ పాటు వైసీపీ ఏమి చేసింది అన్నది పక్కన పెడితే మొత్తానికి రోడ్డెక్కింది. కూటమి పాలన మీద వ్యతిరేక గళం వినిపించింది. ఏపీలో అనేక చోట్ల వైసీపీ కార్యక్రమాలు నిర్వహించింది. వైసీపీ నియోజకవర్గం ఇంచార్జిలు అంతా తమ కార్యకర్తలతో పాటు బయటకు వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఇందులో ఎవరికి తోచిన తీరున వారు వినూత్న ప్రదర్శనలు కూడా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని వైసీపీ నేతలు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తీరు పట్ల కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కదలిక వచ్చినట్లేనా :
ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం మీద వైసీపీ ఆందోళన ముఖ్య ఉద్దేశ్యం పార్టీలో కదలిక తీసుకుని రావాలని. అందుకే వారం రోజుల ముందుగానే కార్యక్రమాలు దశల వారీగా నిర్వహించుకోవాలని పార్టీ ఒక షెడ్యూల్ ని రిలీజ్ చేసింది. దాని ప్రకారం వైసీపీ మెల్లగా కదిలి జూన్ 12 నాటికి రోడ్డెక్కింది. ఇంచార్జిలకు ఇది పరీక్షగా అధినాయకత్వం పెట్టడంతో పాటు క్లోజ్ గా మానిటరింగ్ చేయడం వల్ల అనేక మంది నేతలు జనంలోకి వచ్చినట్లు అయింది. ఈ నిరసనలు జనంలో ఏ మేరకు ప్రభావం చూపించాయన్నది పక్కన పెడితే వైసీపీ యాక్టివ్ అయింది అన్నది మాత్రం స్పష్టం చేసినట్లు అయింది.
సంస్థాగత బలంతో :
ఏ రాజకీయ పార్టీ అయినా సంస్థాగత బలంతోనే ముందుకు సాగుతుంది. ఆ విధంగా చూస్తే వైసీపీకి అదే బలహీనంగా మారి 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో అధినేత ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆయన్ని నేతలు అంతా అనుసరిస్తారు. కానీ వైసీపీ మాత్రం 2024 తరువాత రివర్స్ లో పాలిటిక్స్ చేస్తూ వస్తోంది. జగన్ పెద్దగా జనంలోకి రావడం లేదు, పార్టీ నేతలను ముందు పెడుతున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద కోటి సంతకాల సేకరణ అయినా ఇతర ప్రజా సమస్యల మీద పోరాటం అయినా వైసీపీని అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా రెండేళ్ళ కూటమి పాలన మీద కూడా వైసీపీ అధినాయకత్వం పార్టీనే ముందు పెట్టింది. పార్టీ ముందు పట్టాలెక్కితే ఆ మీదట అధినాయకత్వం ఇమేజ్ కూడా తోడు అవుతుందని అపుడు మంచి ఫలితాలు వస్తాయని భావించి ఈ రకంగా వ్యూహ రచన చేస్తున్నారు అని అంటున్నారు.
జనంలో చర్చ కోసం :
ఇక కూటమి ప్రభుత్వం ఎటూ తమ రెండేళ్ళ పాలన మీద సభలు పెడుతుంది. దానికి పోటీగా వైసీపీ అదే రోజు ఆందోళనలు నిర్వహించడం ద్వారా ఈ అంశాలు అన్నీ జనం ముందు చర్చకు పెట్టాలని భావించింది. ఒక విధంగా చూస్తే ఇది రాజకీయపరమైన వ్య్హూహం. ఈ విషయలో వైసీపీ కొంత మేరకు సక్సెస్ అయినట్లుగా ఆ పార్టీ నిర్వహించిన ఆందోళనలు స్పష్టం చేసాయి. కూటమి ప్రభుత్వం చెప్పేది జనాలు విన్నారు, విపక్షం విమర్శలను ఆలకించారు, దానొత వారే దీనిని ఆలోచించుకునేలా ఒక బిగ్ డిబేట్ కి వైసీపీ తెర తీసింది అని అంటున్నారు.
వైసీపీకి అగ్ని పరీక్ష :
మరో వైపు వైసీపీ నెమ్మదిగా జనం వైపుగా కదిలేందుకు ఈ కార్యక్రమాలు అన్నీ దోహదపడుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అయితే రోడ్డు మీద కనిపించింది. మరి ముందు ముందు వైసీపీకి కూడా అగ్ని పరీక్షలు అనేకం ఉన్నాయి. అధికారంలో ఉన్న బలమైన కూటమిని ఎదుర్కోవాలంటే నిరంతరం ఉద్యమాలు పోరాటాలు ఉండాలి. అంతే తప్ప సీజనల్ గా చేసే పోరాటాలు జనంలో రిజిస్టర్ కావు అన్నది కూడా ఆలోచించాల్సి ఉందని అంటున్నారు. మరి ఇది వైసీపీకి శుభారంభమా కాదా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.