ఏపీలో హాట్ టాపిక్ : అదే నిజమైతే.. ఎన్నికలే రద్దు చేయాలి
ఏదైనా విషయంపై అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రచారం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది.;
ఏదైనా విషయంపై అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రచారం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణానికి సంబంధించిన మూడవ చార్జిషీట్లో దర్యాప్తు బృందం అధికారులు గత ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు వైసిపి నాయకులు వైసిపి పార్టీ కూడా భారీ ఎత్తున సొమ్ములు వెచ్చించిందని చెప్పుకొచ్చారు. కోట్లాది రూపాయలను మద్యం ముడుపులుగా స్వీకరించి వాటిని ఓట్లు కొనుగోలు చేసేందుకు తరలించారు అని పేర్కొంది.
దాదాపు 3500 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ జోరుగానే సాగింది. ఇప్పటివరకు జరిగిన అరెస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా మూడవ చార్జిషీట్లో పేర్కొన్న అంశాలు మాత్రం కేవలం కేసు పరంగానే కాకుండా రాజకీయంగా, ప్రజాస్వామ్యం పరంగా.. ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అంశాలపై విమర్శలకు దారి తీసేలాగా అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలాగా కూడా చేస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చను బట్టి దేశంలో ఎన్నికల వ్యవస్థ బలహీనంగా మారిందని అవకతవకలు జరుగుతున్నాయని తేలింది.
అదే విధంగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే గత ఎన్నికల్లో వైసిపి నాయకులు డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేశారని.. ఈ క్రమంలోనే 3,500 కోట్లలో సింహభాగం ఓట్లకే ఖర్చు పెట్టారనేది సిట్ తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. ఇదే నిజమైతే గత ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు వైసిపి నాయకులు డబ్బులు వెచ్చించి ఉంటే.. కచ్చితంగా ఆ ఎన్నికలను రద్దు చేయాలి అనేది ప్రజాస్వామ్యవాదుల వాదన.
దీనిపైనే తాజాగా సామాజిక హక్కుల పోరాటం చేసేవారు అదేవిధంగా తటస్థంగా ఉండేవారు కోర్టుకు వెళ్లాలి అనేది చర్చకు దారితీసింది. దీనిపై భారీ ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సోషల్ మీడియాలో గాని అటు ప్రధాన మీడియాలో కూడా గత ఎన్నికల్లో డబ్బులు పెట్టి వైసిపి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉంటే ఎన్నికల సంఘం ఏం చేసినట్టు ఎన్నికల అధికారులు ఏం చేసినట్టు అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగానే సిట్ చెప్పింది వాస్తవం అయివుంటే ఎన్నికల సమయంలో డబ్బులు పెట్టి వైసిపి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉంటే ప్రత్యర్థులు అప్పుడు ఏం చేశారు? అనేది ప్రశ్న.
ప్రత్యర్థులు కూడా ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారా? లేదా? అనే విషయాలు తేల్చాల్సి ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా సిట్ అధికారులు వెల్లడిస్తున్న చార్జిషీట్లు ఆ కేసును బలోపేతం చేస్తున్నాయో లేదో చెప్పలేం కానీ ఇతర అంశాలు ఇతర విషయాలు రాజ్యాంగపరమైన వ్యవస్థలపై కూడా సందేహాలు లేవనెత్తుతున్నాయి అన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
ఇప్పటికే కేంద్రంలో ఓటు చోరీ జరిగిందనే ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటు రాష్ట్రంలోనూ వైసీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి సమయంలో ఓట్లు కొనుగోలు చేసేందుకు వైసిపి నాయకులు ప్రయత్నించారని అధికారులు చార్జిషీట్ రూపంలో చెప్పటం వివాదానికి దారితీస్తుంది. దీనిపై మున్ముందు కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.