జగన్ మారాలి...రోజులు మారుతున్నాయి !

రాజకీయం అంటే ఎప్పటికపుడు మార్పుతో కూడుకున్నది. ఎప్పుడూ స్థిరమైన విధానాలతో వ్యవహరిస్తామంటే సక్సెస్ రేటు తగ్గిపోతుంది.;

Update: 2025-07-29 01:30 GMT

రాజకీయం అంటే ఎప్పటికపుడు మార్పుతో కూడుకున్నది. ఎప్పుడూ స్థిరమైన విధానాలతో వ్యవహరిస్తామంటే సక్సెస్ రేటు తగ్గిపోతుంది. కన్యాశుల్కంలో గిరీశం చెప్పినట్లుగా ఒపీనియన్స్ ని చేంజ్ చేసుకోవడం అవసరం. దాని వల్లనే విజయాలు సొంతం అవుతాయి. కానీ వైసీపీ అధినేత మాత్రం ఇంకా 2011 దగ్గర ఆగిపోయారా అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా వస్తోంది. జగన్ వైసీపీని పెట్టాక మొత్తం మూడు సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేశారు. అందులో ఒక భారీ విజయం, రెండు అపజయాలు దక్కాయి. తాజాగా 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి దక్కింది. దాంతో వైసీపీలో ఒక రకమైన చర్చ అయితే మొదలైంది.

అంతా జగన్ తోనే :

ఎవరేమనుకున్నా వైసీపీలో సర్వం సహా జగనే. ఆయన చుట్టూనే కేంద్రీకృతం అయి పార్టీ నడుస్తోంది. మరో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీలో ఈ పరిస్థితి లేదు. అక్కడ కూడా చంద్రబాబుదే అంతిమ నిర్ణయం. కానీ కొన్ని పార్టీ వేదికలు సీనియర్లకు బాధ్యతలు ఇలా చాలా ఉంటాయి. పైగా అభిప్రాయాలను చెప్పుకోవడం నిర్ణయాలను కలసి తీసుకోవడం అన్నది కనిపిస్తోంది. వైసీపీలో చూస్తే జగన్ విషయంలో గణనీయమైన మార్పు రావాలని సీనియర్లు కోరుతున్నారు. వైసీపీ అనే రాజకీయ పార్టీ మొత్తం జగన్ తోనే అల్లుకుని ఉంది. కాబట్టి జగన్ లో మార్పు అవసరం అని పార్టీ పెద్దలు చెబుతున్నారు.

జగన్ తో అదేనా ఇబ్బంది :

జగన్ లో ఒక అలవాటు ఉంది అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన ఎవరో ఒకరి మాట వింటే అందులో కరెక్ట్ ఎంత రాంగ్ ఎంత అన్నది ఆలోచన చేయకుండా దానినే అనుసరిస్తారు అని అంటున్నారు. ఉదాహరణకు జగన్ వద్దకు అపాయింట్మెంట్ దొరికి ఒక నియోజకవర్గం నాయకుడు వెళ్ళి కలిశారు అనుకుందాం. ఆయన తనకు ఆ నియోజకవర్గం ఇంచార్జి పడకపోతే వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే దానిని నెగిటివ్ గా జగన్ కి చెబుతాడు. ఆ తరువాత జగన్ అందులో నిజానిజాలు చూడకుండా సదరు ఇంచార్జిని తరువాత మీటింగులో తిడతారు అని చెప్పుకుంటున్నారు.

ఒక వైపే చూస్తున్నారా :

ఇక జగన్ అధినాయకుడు. ఆయన వద్దకు అందరూ వెళ్తారు. పార్టీలో నాయకుల మధ్యన పొరపొచ్చాలు ఉండొచ్చు ఒకరి పొడ ఒకరికి గిట్టక పోవచ్చు. ఎందుకంటే ఇది రాజకీయం కాబట్టి. ఎవరి అవకాశాలు వారు దక్కించుకోవాలన్న తాపత్రయంతో చెప్పాల్సినవి చెబుతారు. దాంతో ఎవరు ఏమి చెప్పినా దానినే నిజం అనుకుని ఒకవేళ తప్పు లేకపోయినా మరో నాయకుడిని నిందిస్తే వారు పార్టీలో ఉండగలరా అన్నదే చర్చగా ఉందిట. ఇక ఇంచార్జి మీద ఫిర్యాదు చేస్దిన వ్యక్తి నేపధ్యం ఏమిటి ఆయన ఇంచార్జి కి వ్యతిరేకంగా ఉన్నారా లేక టీడీపీ జనసేన ప్రభావంతో ఉన్నారా ఇవ్వన్నీ అధినాయకుడిగా జగన్ ఆలోచించుకోవాలి కదా అని అంటున్నారుట.

కోటరీ టార్గెట్ చేస్తే అంతే :

ఇక వైసీపీలో పైకి సంస్థాగతంగా పార్టీ వ్యవస్థ కనిపిస్తున్నా అంతర్గతంగా అత్యంత పవర్ ఫుల్ గా కోటరీ ఉంది అని అంటున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా బలంగా కోటరీ ఒకటి వైసీపీలో తయారైంది అని అంటున్నారు. ఆ కోటరీ జగన్ కి అత్యంత సాన్నిహిత్యం నెరుపుతుంది. ఆ కోటరీకి కనుక ఎవరైనా టార్గెట్ అయ్యారా అంటే ఇక వారి పని సరి అని ప్రచారం అయితే ఉందిట. ఆ కోటరీ అంతా ఒక్కటిగా అయి తమకు నచ్చని నాయకుడి మీద జగన్ కి ఫిర్యాదు చేస్తారు అని దాంతో ఆ వ్యక్తికి పార్టీతో అన్నీ కట్ అయినట్లే అని చెబుతున్నారు.

విధేయత ఎవరికి :

పార్టీలో అధినాయకుడుగా జగన్ ఉన్నారు. జగన్ విధేయత చూపిస్తూ గ్రౌండ్ లెవెల్ లో పని చేసుకుని పోయే వారు ఎంతో మంది నాయకులు ఉన్నారు. అయితే ఒక ఇంచార్జి తన వద్ద ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో బాగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నా కోటరీకి కోరినట్లుగా చేయకపోయినా నడచుకోకపోయినా ఇంతే సంగతులు అని పుకార్లుగా పార్టీలో అంతా చెప్పుకుంటున్నారు. కొన్ని సార్లు కోటరీకి ముడుపులు ఇవ్వకపోయినా సదరు ఇంచార్జి పదవి సైతం గల్లంతు అవుతుంది అని అంటున్నారు

విచారించే విధానం ఏదీ :

పార్టీలో ఎవరి మీద అయినా ఫిర్యాదులు రావచ్చు. అది అన్ని పార్టీలలో సహజమైన ప్రక్రియగా ఉంటుంది. అయితే ఫిర్యాదులు వచ్చినపుడు పార్టీ వ్యవస్థలో విచారణ జరగాలి. దాని మీద నివేదిక తయారు చేసి ఆ మీదట అధినాయకత్వం చర్యలకు దిగినా సబబుగా ఉంటుందని అంటున్నారు. కానీ ఏమీ లేకుండా ఒక ఫిర్యాదు వస్తే చాలు ఇక మీ సేవలు వద్దు అని ఆయనను పార్టీ నుంచి పంపిస్తే ఇక ఎలా అన్నదే అందరి ఆందోళనగా ఉందని అంటున్నారు. వైసీపీలో ఈ రకమైన చిత్ర విచిత్రమైన పరిస్థితి ఉంది అని అంటున్నారు.

అందుకే ఆ నినాదంతో :

వైసీపీలో జగన్ మారాలి అన్నది సీనియర్ల మాటగా ఉంది. రాజకీయం అంటే జనంతోనే కాదు పార్టీ జనంతోనూ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. పార్టీలో ఏ విధానం తీసుకున్నా అది మెచ్చతగినదిగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఏకపక్షంగా ఉంది అని ఎవరైనా భావించినపుడు అంతిమంగా అది పార్టీకే చేటు తెస్తుంది అని అంటున్నారు. నాయకుల నైతిక స్థైర్యం దెబ్బ తినకుండా పార్టీని ముందుకు తీసుకుపోవాల్సి ఉందని సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ మారాలి అన్న నినాదం గట్టిగానే వినిపిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News