‘NDA- నారా నకిలీ డిస్టలరీస్’ రోజా కొత్త అర్థాలు
వైసీపీ పిలుపు మేరకు సోమవారం ‘నకిలీ మద్యంపై రణభేరి’ కార్యక్రమంలో పాల్గొన్నరోజా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు గుప్పించారు.;
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా గేరు మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు సైలెంటుగా ఉన్న రోజా.. పార్టీ పిలుపుతో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన నకిలీమద్యంపై సోమవారం ఆందోళన నిర్వహించారు. తన సొంత నియోజకవర్గం నగరిలో వందల మంది మహిళలను వెంటబెట్టుకుని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన రోజా.. కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలపై సంచలన ఆరోపణలు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు సెటైర్లు పేల్చారు.
గత ప్రభుత్వంలో జోరు చూపించిన మంత్రుల్లో రోజా ముందుండేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ టార్గెట్ గా ఆమె గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక రోజా టార్గెట్ అయ్యారంటూ చాలాకాలంగా ప్రచారం జరిగింది. అయితే తనను ఎవరూ ఏం చేయలేరని తెగేసి చెబుతున్న రోజా.. ఇటీవల కాలంలో జోరుపెంచారు. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాల్లో టచ్ మీ నాట్ అన్నట్లు ఉండిపోయిన రోజా ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచారు.
వైసీపీ పిలుపు మేరకు సోమవారం ‘నకిలీ మద్యంపై రణభేరి’ కార్యక్రమంలో పాల్గొన్నరోజా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు గుప్పించారు. అసలే వాగ్దాటి ఎక్కువగా ఉండే రోజా సీఎంపైన ప్రభుత్వంపైన పేల్చిన సెటైర్లు వైసీపీ కార్యకర్తల్లో ఉత్తేజం పెంచాయి. తన నివాసం నుంచి నగరి ఎక్సైజ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేసిన రోజా, అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి పాలనలో ఐదేళ్ల పాటు మద్యం దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు చెప్పారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 43,000 బెల్టు షాపులు నిర్వహిస్తే, జగన్ ప్రభుత్వం వచ్చి వాటిన్నటినీ తొలగించినట్లు వివరించారు.
ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. నారా వారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేసిన రోజా.. ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త భాష్యం చెప్పారు. ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టలరీస్ అమ్మడమని, దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పై స్థాయి నుంచి కింద వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు తుడిచేస్తున్నారని, మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని వినతిపత్రం సమర్పించారు.