నా కన్నా మీకే ఎక్కువ తెలుసు: జగన్ వ్యాఖ్యల మర్మం ఏంటి.. ?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంలో వైసీపీ అధినేతజగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.;
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంలో వైసీపీ అధినేతజగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. తొలి రోజుమాత్రమే సభకు వస్తామని.. తొలుతచెప్పిన ఆయన..తర్వాత.. ప్రతిరోజూ శాసనసభకు హాజరు కావాలని నిర్ణయించారని వైసీపీ వర్గాలే చెప్పాయి. కానీ, తొలిరోజు సభకు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. ఇక, మరుసటి రోజు పూర్తిగా గైర్హాజరయ్యారు. ఇక, ఇప్పుడు లడ్డూపై చర్చ జరిగిన సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు వస్తారని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా శాసన మండలి సభ్యులు పూర్తిగా సభకు హాజరు కావాలని.. ఎక్కడా ఏ చిన్న అవకాశం వచ్చి నా మిస్ చేసుకోవద్దని కూడా ఆయన సూచించారు. ఇదిలావుంటే.. ఈ సందర్భంగా జగన్.. ఎమ్మెల్సీలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు.. అంటూ.. వారిని కొనియాడారు. తాను సభకు వచ్చినా.. తక్కువ సమయం ఇస్తారని.. కాబట్టి మండలిని సంపూర్ణంగా వినియోగించుకునే విషయంలో ఎమ్మెల్సీలు కృషి చేయాలన్నారు.
అన్ని విషయాలపైనా తనకంటే కూడా.. మండలి సభ్యులకే ఎక్కువగా అవగాహన ఉందన్నారు. అందుకే తాను వారిని ప్రోత్సహించాలని నిర్ణయించానని చెప్పారు. ఎవరు ఎక్కువగా కష్టపడితే.. వారికి అదేస్థాయి లో వైసీపీ అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఉంటుందన్నారు. తద్వారా.. ఎమ్మెల్సీలను ఆయన తనవైపు తిప్పుకొనే ప్రయత్నంతోపాటు.. తాను సభకు ఎందుకు రావడంలో చెప్పేందుకు సమర్థించుకునే ధోరణి లో మాట్లాడారు. అన్ని విషయాలను ఆధారాలు, సాక్ష్యాలతో సహా రెడీ చేసుకుని మండలిలో వ్యవహరించా లన్నారు.
పార్టీ పరంగా ఎలాంటి సమాచారం కావాలన్నా.. 24 గంటలు అందుబాటులో ఉండే వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జగన్ చెప్పారు. తద్వారా.. తాను అసెంబ్లీకి వచ్చేది లేదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. కళ్లు మూసుకుంటే రెండేళ్లు గడిచిపోయాయని.. మరో మూడేళ్లు కూడా అంతేనన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకున్నాక.. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నీ.. కష్టపడుతున్నవారికే దక్కుతాయని తేల్చి చెప్పడం ద్వారా.. ఎమ్మెల్సీలను రంగంలోకి దింపే ప్రత్యేక వ్యూహానికి ఆయన తెరదీశారు.