ఉగాది తరువాత జగన్ సంచలన నిర్ణయం ?
ఇక బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయడం అప్పటికి పూర్తి అయితే జగన్ జిల్లాల పర్యటన షురూ చేస్తారు అని అంటున్నారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీని పటిష్టం చేయడం మీద ఫోకస్ పెడుతున్నారు. ఆయన బెంగళూరులో ఉంటున్నా కూడా అక్కడ వేదికగా చేసుకుని రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు అని అంటున్నారు. మరో మూడేళ్ళలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఇప్పటి నుంచే జనంలోకి పార్టీని తీసుకుని వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి అయితే తాను పర్యటనలు మొదలుపెట్టాలని కూడా ఆయా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
బూత్ లెవెల్ దాకా :
వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఇంచార్జిలను అయితే నియమించారు. వారంతా బూత్ లెవెల్ దాకా కమిటీలను వేయాలని ఆదేశించారు. చాలా కాలంగా ఈ ప్రక్రియ సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యవర్గాలను వేయడమే కాకుండా అనుబంధ కమిటీలను కూడా వేయాలని జగన్ కోరుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో వైసీపీకి కనీసంగా పదిహేను వేలకు తగ్గకుండా పార్టీ పదవులలో నేతలు ఉంటే వారే బలంగా మారుతారని అది రేపటి ఎన్నికల్లో విజయానికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. ఇదంతా పార్టీ నేతలు పాజిటివ్ గా తీసుకుని పనిచేయాలని ఆయన దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఉగాది ముహూర్తంగా :
ఇదిలా ఉంటే జగన్ జనంలోకి ఎపుడు వస్తారు అన్న చర్చ సాగుతూనే ఉంది. ఆయన 2024 డిసెంబర్ నుంచి జనంలోకి వస్తారు అన్నది అపుడు ప్రచారంలో ఉన్న మాట. ఆ తరువాత అది కాస్తా సంక్రాంతి పండుగ 2025 కి మారింది. ఆ మీదట అదే ఏడాది వైఎస్సార్ జయంతి నుంచి అని కూడా ప్రచారం చేశారు. ఇక 2026 సంక్రాంతి తరువాత జగన్ జనం లోకి అని కూడా అన్నారు. కానీ ఇపుడు చూస్తే కొత్త ముహూర్తం అన్నది వినిపిస్తోంది. అదే ఉగాది పండుగ తరువాత నుంచి జగన్ జిల్లాల టూర్లు అని అంటున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. పైగా మంచి రోజులు అన్నీ ముందునే ఉన్నాయి. దాంతో జగన్ తెలుగు వారి ఉగాది పండుగ తరువాత జనంలోకి వస్తారు అని అంటున్నారు.
ఎందుకు ప్రాధాన్యం :
ఇక బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయడం అప్పటికి పూర్తి అయితే జగన్ జిల్లాల పర్యటన షురూ చేస్తారు అని అంటున్నారు. అయితే ఈ పర్యటనలో జగన్ పార్టీ నేతలతోనే ఎక్కువగా గడుపుతారు అని అంటున్నారు ప్రత్యేకించి పార్టీ క్యాడర్ తో భేటీ అయి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఏమిటి అన్నవి తెలుసుకుంటారు అని అంటున్నారు. ఏపీలో ఉన్న మొత్తం 26 జిల్లాలలో జగన్ పర్యటన ఉంటుందని, ప్రతీ జిల్లాలో రెండు రోజుల పాటు సాగుతుందని చెబుతున్నారు. అంటే మొత్తంగా 50 రోజులు పై మాటే అన్న మాట. ఇది కూడా విడతల వారీగా ఉండొచ్చు అని చెబుతున్నారు. అలా ఈ ఏడాది చివరి దాకా సాగవచ్చు అని అంటున్నారు.
బస్సు యాత్రగానా :
ఈ జిల్లాల టూర్ కూడా బస్సు యాత్రగా చేపడతారు అని అంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా జనాలతో పాటుగా పార్టీ క్యాడర్ ని కూడా కలవచ్చు అన్న ఉద్దేశ్యం ఉంది అని అంటున్నారు. ఈ పర్యటనలో ఆయా జిల్లాలలో రాత్రి బస కూడా చేస్తారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది అంతా పార్టీతోనే కలసి ఉండాలని క్యాడర్ తో మమేకం కావాలని జగన్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ప్రకారం ఉగాది తరువాత జగన్ టూర్ ఉంటుందా అన్నది.