పవన్ కల్యాణ్ పై దూషణలు.. యువకుడి అరెస్ట్!
అవును... గత ప్రభుత్వ హయాంలో కూటమి నేతలపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికలపైనా, మైకుల ముందూ తీవ్ర దూషణలు చేసిన సంగతి తెలిసిందే!;
గత ప్రభుత్వ హయాంలో చాలా మంది యువకులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్ లతో పాటు పలువురు టీడీపీ నేతలు, జనసేన శ్రేణులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా వారిపై అభ్యంతరకర, అసభ్యకర పోస్టులు పెట్టారు!
మరికొంతమంది వైసీపీ శ్రేణులు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ పోస్టులు పెట్టిన పరిస్థితి. ఇక మరికొంతమంది నేతలు మైకుల ముందు విచ్చలవిడిగా చెలరేగిపోయిన వైనం! ఇక సాక్ష్యాత్తు ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలోనూ టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపైనా ఘోరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో చాలా మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో కొంతమంది బెయిల్ పై విడుదలవ్వగా.. మరికొంతమంది జైలులో మగ్గుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం మారినా ఈ దూషణలు మాత్రం ఆగడం లేదు!
అవును... గత ప్రభుత్వ హయాంలో కూటమి నేతలపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికలపైనా, మైకుల ముందూ తీవ్ర దూషణలు చేసిన సంగతి తెలిసిందే! అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవి ఆగడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పై ఓ యువకుడు దూషణలకు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను నరసరావుపేట మండలం, ములకలూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు దూషించాడని స్థానిక జనసేన నేత లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అతడిని నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.