ఒకే వేదికపైకి జగన్, షర్మిల... కారణం ఇదే!

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ కు, పీసీసీ చీఫ్ షర్మిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-07-03 08:30 GMT

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ కు, పీసీసీ చీఫ్ షర్మిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో షర్మిల పాత్ర కూడా ఉందనేది చాలా మంది విశ్లేషణ. ఆమే కడప ఎంపీ సీటు గెలవలేదు కదా అన్నా... రాష్ట్రం మొత్తం మీద ఎంతో కొంత ప్రభావం చూపించిందని మాత్రం అంటారు.

మరోవైపు.. ప్రస్తుతం ఏపీలో కూటమి పార్టీలు అధికారంలో ఉన్నా.. ఇప్పటికీ అన్న పైనే ఆమె నిప్పులు చెరుగుతున్నారనే విమర్శలు వినిపిస్తుంటాయి. ఫలితంగా పార్టీలోనూ ఆమె వ్యతిరేకత ఎదుర్కొంటుందని చెబుతున్నారు. ఆమె మాత్రం... మోడీకి జగన్ దత్తపుత్రుడు అంటూనే, జగన్ కాంగ్రెస్ తోనే కలవాలి అనే కామెంట్లూ చేస్తున్నారని అంటున్నారు.

ఏది ఏమైనా... ఏపీ రాజకీయాల్లో ఈ అన్నాచెల్లెల్లి రాజకీయ రగడ మాత్రం విభిన్నంగా కొనసాగుతుంటుంది. జాతీయ స్థాయిలో వచ్చేసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఏపీలో 2029 తనదే అనే ధీమాతో జగన్ ఉన్న పరిస్థితి! ఈ సమయంలో... వైఎస్ జగన్, షర్మిల ఒకేరోజు పులివెందులలో ప్రత్యక్షమవ్వబోతున్నారు!

అవును... ఈ నెల 8న వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా... ఆ రోజున తమ తండ్రికి నివాళి అర్పించేందుకు వైసీపీ అధినేత జగన్.. పీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయకు రానున్నారు. ఇది 75వ జయంతి కావడంతో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారని అంటున్నారు. ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు.

దీంతో... దానికి సంబంధించిన వేదికపై అన్నాచెల్లెల్లు ఇద్దరూ ఒకేసారి కనిపించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఈ సమయంలో... 75వ జయంతి సందర్భంగా విజయమ్మతో పాటు జగన్, షర్మిల ఒకేసారి నివాళులు అర్పిస్తారా.. లేక, ఎవరికి వారే కానిస్తారా.. అసలు పలకరించుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు.. వైఎస్సార్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు వైసీపీ నిర్ణయించింది.

మరోవైపు జగన్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా.. ఈ నెల 8న పులివెందులలో తన తండ్రి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. 9న చిత్తూరు జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా... మామిడి రైతులను జగన్ పరామర్శించనున్నారు.

Tags:    

Similar News