చక్రం తిప్పుతున్న వైఎస్ సునీత.. ఇక వారందరికీ బ్యాడ్ టైమ్!
అయితే తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయపోరాటం చేసిన సునీత్ సుప్రీంకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసుకున్నారు.;
కూటమి ప్రభుత్వంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత చక్రం తిప్పుతున్నారు. తన అన్న, మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత ఇప్పుడు తన తండ్రి హత్య కేసులో నిందితులు, వారికి సహయం చేసిన వారికి చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి ఆమెకు సంపూర్ణ సహకారం అందుతోందన్న టాక్ వినిపిస్తోంది. వివేకా పీఏ కృష్ణారెడ్డి చేసిన తప్పుడు ఫిర్యాదుతో సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కేసు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా సక్సెస్ అయిన ఆమె రానున్న రోజుల్లో మరింత పట్టుబిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
వివేకా హత్య కేసులో తనను తప్పుడు సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే నిందితులు ఈ ఫిర్యాదు చేయించారని అప్పట్లో సునీత ఆరోపించారు. అయితే ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, నిందితులకు అప్పట్లో మంచి పరపతి ఉండటంతో సునీత వాదనకు విలువ లేకుండా పోయింది. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత నిందితులు ఊహించినట్లే సీబీఐ విచారణలో జోరు తగ్గిందనే ప్రచారం జరిగింది. అయితే తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయపోరాటం చేసిన సునీత్ సుప్రీంకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసుకున్నారు.
కాగా, సునీత ప్రభృతులపై కేసు నమోదు వెనుక పులివెందులలో నివాసం ఉంటున్న ప్రస్తుత రాజుపాలెం ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, అప్పట్లో ఏఎస్పీగా పనిచేసిన రాజేశ్వరరెడ్డి హస్తం ఉన్నట్లు భావించిన సునీత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై ఫిర్యాదు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితతో ప్రత్యేకంగా భేటీ అయిన సునీత అప్పట్లోనే ఈ ఇద్దరు నిందితులతో కుమ్మక్కైన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. ఇక సునీత ఫిర్యాదుతో శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించగా, ఆ విచారణలో నిందితులతో ఈ ఇద్దరికి సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వారిపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.
రెండు రోజుల క్రితం ఈ ఆదేశాలు వెలవడగా, ఇప్పుడు సునీత మరింత పట్టు బిగించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. తన తండ్రి హత్య వెనుక ఇంకొందరు కీలక వ్యక్తుల హస్తం ఉందని అనుమానిస్తున్న సునీత వారి గుట్టు రట్టు చేసేలా కూటమి పెద్దల సహకారం కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో గత ప్రభుత్వంలో సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపేలా సునీత ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఆయన బెయిలు రద్దు చేయించడం, సీబీఐ దర్యాప్తు కొనసాగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా సునీత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.