జగన్ చేయలేనిది.. షర్మిల చేస్తోందా? కాంగ్రెస్ చీఫ్ పెద్ద స్కెచ్
రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి వైసీపీయే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి. అసెంబ్లీలో సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్షంగా వైసీపీకి ఊరూరా బలం, బలగం ఉంది.;
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయంగా దూకుడు పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో నామరూపాల్లేకపోయినా, పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టాక.. నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. షర్మిల వ్యక్తిగత ఇమేజ్ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా మారిన పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటంలో షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను వెనక్కి నెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి వైసీపీయే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి. అసెంబ్లీలో సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్షంగా వైసీపీకి ఊరూరా బలం, బలగం ఉంది. అయినప్పటికీ విపక్షంగా పూర్తి స్థాయిలో సత్తా చాటుకోవడంలో వైసీపీ తడబడుతోందని అంటున్నారు. ఇదే సమయంలో కనీస బలం లేకపోయినా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ స్వరం వినిపించడంలో సక్సెస్ అవుతున్నారని అంటున్నారు. భవిష్యత్ లో వైసీపీకి తానే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ షర్మిల చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. తానే స్వయంగా అసెంబ్లీ ముట్టడికి బలగాన్ని వేసుకుని బయలుదేరారు. అయితే పోలీసులు అడ్డుకున్నప్పటికీ తన రాజకీయ ఉద్దేశాన్ని చాటుకోవడంలో షర్మిల సక్సెస్ అయ్యారు. అమె పిలుపునిచ్చిన చలో అసెంబ్లీకి మీడియాలో పెద్ద ఎత్తున కవరేజ్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా షర్మిల పోరాటంపై చర్చ జరిగిందని అంటున్నారు.
నిజానికి ప్రతిపక్షంగా వైసీపీ చేయాల్సిన ఉద్యమాన్ని షర్మిల తన భుజాన వేసుకోవడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి రామని మొండికేస్తున్న వైసీపీ.. రైతుల సమస్యపై సభ వెలుపల అయినా ధర్నా వంటి ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉన్నప్పటికీ, సద్వినియోగం చేసుకోలేకపోతుందని విమర్శలు మూటగట్టుకుంటోందని అంటున్నారు. అయితే సభలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా, రాష్ట్రంలో పెద్దగా కేడర్ లేకపోయినా షర్మిల మాత్రం ప్రభుత్వంపై పోరాటానికి విమర్శలు చేయడానికి వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు. దీనివల్ల ఆమెకు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తన సోదరుడు మాజీ సీఎం జగన్ బెంగళూరులో ఉండటం కూడా షర్మిల అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని చెబుతున్నారు. తన దూకుడు వల్ల జగన్ ను అధిగమించాలనే ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అందుకే గతంలో ఏ విషయంలో అయినా జగన్ పై విమర్శలు చేసిన షర్మిల.. ప్రస్తుతం ఆయన జోలికి వెళ్లడం లేదని, ప్రజలు జగన్ ను మరచిపోయే పరిస్థితి తీసుకురావాలని షర్మిల పావులు కదుపుతున్నారని అంటున్నారు. నాయకురాలిగా తన సమర్థత చాటుకుంటే ఆటోమెటిక్ గా కేడర్ బలపడుతుందని షర్మిల అభిప్రాయంగా చెబుతున్నారు. అందుకే విపక్ష నేతగా జగన్ విఫలమైన అంశాలను తాను తలకెత్తుకోవాలని షర్మిల డిసైడ్ అయినట్లు అభిప్రాయపడుతున్నారు.