అన్నయ్యలు చేయాల్సిన పనేనా? జగన్, కేటీఆర్ పై షర్మిల ఇంట్రస్టింగ్ కామెంట్స్

తాజాగా కేటీఆర్ వర్సెస్ కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతుండగా, ఏపీలో జగన్, షర్మిల మధ్య వివాదాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి.;

Update: 2025-11-20 06:03 GMT

అన్నల చేతిలో మోసపోయిన చెల్లెళ్లుగా తనది, కవితదీ ఒకటే బాధంటూ ఆవేదన చెందుతున్నారు వైఎస్ షర్మిల. తన సొంత అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ చేతిలో తాను ఏ విధంగా ఇబ్బందులు పడ్డానో.. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల ఆయన చెల్లెలు కవిత అదే పరిస్థితి ఎదర్కొన్నారని షర్మిల పరోక్షంగా వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కవిత చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో షర్మిల, కవిత తమ కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సారూప్యత ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై విజయవాడలో షర్మిలను మీడియా ప్రశ్నించింది.

అన్నగా ఒకే ఒక్క చెల్లిని చూసుకోలేడా? అంటూ జగన్ ను ప్రశ్నించారు షర్మిల. జగన్‌కు తాను దూరం కాలేదని, అతనే తనను, అమ్మ విజయమ్మను దూరం పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉన్న ఒకే ఒక్క చెల్లిని కూడా చూసుకోకపోతే ఎలా? కోరిన వెంటనే నేను అన్న కోసం వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఇంతకంటే చిత్తశుద్ధిని పదే పదే నిరూపించుకోవాలా? చెల్లెల్లను సరిగా చూసుకుంటే బయటికి ఎందుకొస్తాం’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలకు ముందు ఏపీలో పాదయాత్ర చేసిన షర్మిల.. 2019లో ఆయన గెలిచిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను ఆ తర్వాత ఆ పదవి నుంచి తొలగించారు. ఈ విషయాలపై రగిలిపోతున్న షర్మిల ఎప్పటికప్పుడు జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా కేటీఆర్ వర్సెస్ కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతుండగా, ఏపీలో జగన్, షర్మిల మధ్య వివాదాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. తాను జగన్ కోసం ఎంతో చేశానని, అయినా ఆయన గుర్తించలేదన్న బాధ షర్మిలలో ఇప్పటికీ కనిపిస్తోందని అంటున్నారు. ఆయన అడిగిన వెంటనే 3 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశానని, మహిళగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, అన్నింటినీ అధిగమించి అలవోకగా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానని షర్మిల గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో తాను రాజకీయాలు చేద్దామనుకుంటే.. తన పత్రిక ద్వారా వ్యతిరేక వార్తలు రాసి వేధించారని షర్మిల ధ్వజమెత్తారు.

‘‘నేను పార్టీ పెట్టుకున్నా.. నీకు (జగన్) ఇబ్బంది లేదు. అయినా పార్టీని కూడా వేధించేలా వార్తలు రాయించారు. ఇది తగునా? అని అన్నందుకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. బీఆర్ఎస్ తో కలిసి నన్ను అరెస్టు చేయించారు.’’ అని ఆ నాటి సంగతులను షర్మిల గుర్తు చేసుకున్నారు. అన్నగా జగన్ మరచిపోయినా, సోదరిగా తాను మాత్రం ఎప్పుడూ జగన్ కు అండగా ఉంటానని చెప్పారు. విశ్వాసం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదన్న షర్మిల, అది మనుసులో ఉండాలని స్పష్టం చేశారు. కానీ, అది లేదు కాబట్టే నా దారి నేను చూసుకున్నానని వెల్లడించారు. ‘‘జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకదా? అప్పట్లో వైసీపీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయినా నేను కాలికి బలపం కట్టుకుని పాదాయాత్ర చేశా? నిజంగా నాకు అంత స్టామినా ఉంటుందని అనుకోలేదని షర్మిల చెప్పారు. ఆస్తుల వివాదం తాను సృష్టించింది కాదని, ఇంతకన్నా ఏమీ చెప్పలేంటూ ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల.

Tags:    

Similar News