వైఎస్... పేదల గుండెలపై చెరగని సంతకం..!
వైఎస్ రాజశేఖరరెడ్డి. సముద్రం వంటి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకుల మాదిరిగా కలిసిపోలేదు. తనో కెరటమై పైకి లేచారు.;
వైఎస్ రాజశేఖరరెడ్డి. సముద్రం వంటి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకుల మాదిరిగా కలిసిపోలేదు. తనో కెరటమై పైకి లేచారు. ఉత్తుంగ తరంగంలా పైకెగిరారు. కింద పడలేదు.. ఎగిరి పేదల గుండెల్లో గూ డు కట్టుకున్నారు. పోయినోళ్లందరూ మంచోళ్లే.. అని ఆత్రేయ అన్నట్టుగా.. ఇలాంటి మంచోళ్లలో మహానే త తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేక పీఠిక లిఖించుకున్నారు. ఎంతో మంది వచ్చారు.. పోయారు.. కానీ, ఒక సుస్థిర స్థానం సంపాయించుకున్న తెలుగు నాయకుల్లో ఎన్టీఆర్ తర్వాత.. ఆ స్థానం దక్కించుకున్నది ముమ్మాటికీ వైఎస్ రాజశేఖరరెడ్డే!.
``నాకు రాజశేఖరరెడ్డికి రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. మేం వేర్వేరు సిద్ధాంతాలను నమ్ముతాం. ఆయన దారి ఆయనది. మా దారి మాది. కానీ, ప్రజలకు సేవ చేయడంలో మాత్రం ఇద్దరిదీ ఒకే దారి. నేను ప్రారంభించిన అభివృద్ధి పనులను ఆయన ఎక్కడా ఆపలేదు. ముందుకు తీసుకువెళ్లారు. మరింత మెరుగు పరిచారు. అందుకే హైదరాబాద్ ఇప్పుడు ఒక స్థాయిలో ఉంది.`` అని సాక్షాత్తూ.. వైఎస్‌కు రాజకీయ బద్ధ శత్రువు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఇంతకుమించి.. వైఎస్‌కు సర్టిఫికెట్లు అవసరం లేదు. ఒక ప్రత్యర్థిని.. తనను రెండు సార్లు వరుసగా అధి కారంలోకి రాకుండా అడ్డుకున్న నాయకుడిని పొగడడాన్ని మించిన ప్రశంస రాజకీయాల్లో ఎక్కడా ఉండ దు. అంతేకాదు.. వైఎస్ ప్రారంభించిన.. అనేక పథకాలను ఇప్పటికీ చంద్రబాబు కొనసాగిస్తున్నారు. మంగళవారం(సెప్టెంబరు 2) వైఎస్ వర్థంతి. ఆయన ఇప్పుడు లేరు. కానీ, ఇది భౌతికంగానే. మానసికంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ అన్నా.. ఫీజు రీయింబర్స్‌మెంటు అన్నా.. ఇందిరమ్మ ఇళ్లు అన్నా.. ఆయన పేరు వినిపిస్తూనే ఉంది.
ఇక, పేదల గుండెల్లో ఇప్పటికీ వైఎస్ చిరస్మరణీయుడు. నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దీనిలో వైఎస్ పేరు మరో స్థాయికి వినిపిస్తుంది. అలా ఆయన పాలన ముందుకు సాగింది. పాలన సాగించింది.. స్వల్ప కాలమే. అయినా.. తాను తీసుకువచ్చిన పథకాలు, ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ``ఏం వచ్చారు.. వైఎస్ ఏమైనా చేస్తున్నారా?`` అని పార్టీ అధిష్టానం అడిగినప్పుడు.. ``అందుకు కాదు..`` అని వైఎస్ ప్రత్యర్థులు సొంత పార్టీవారే.. నీళ్లు నమిలిన స్థాయికి వైఎస్ చేరిపోయారు. పడిపోయిందనుకున్న కాంగ్రెస్‌ను పైకిలేపి.. జవసత్వాలు అందించారు. అందుకే.. ఆయన పేదల పక్షపాతి మాత్రమే కాదు.. కాంగ్రెస్‌కు మార్గనిర్దేశకుడు కూడా!.