జగన్ కు Z+ భద్రత ఉన్నట్లా..? లేనట్లా..?
ఇదే సమయంలో నెల్లూరు పర్యటనకు వెళతానంటే హెలిపాడ్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సహకరించడం లేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.;

మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి Z+ భద్రత కల్పించడం లేదని, ఆయనకు Z+ భద్రత ఉన్నప్పటికీ తగిన రక్షణ చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 3 గురువారం జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సివుంది. అయితే ఆయన పర్యటనకు పోలీసులు సహకరించడం లేదని, Z+ భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిగింది. అయితే Z+ భద్రతపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను ఇవ్వాలని కోరడంతో విచారణ వాయిదా పడింది.
మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు ప్రస్తుతం Z+ భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వాదిస్తోంది. అయితే పేరుకు Z+ భద్రత అంటున్నప్పటికీ తగిన రక్షణ చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రధానంగా రోప్ పార్టీని నియమించకపోవడం వల్ల జగన్ పర్యటనల్లో ప్రమాదాలు జరుగుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. గత నెల 18న మాజీ సీఎం రెంటపాళ్ల పర్యటనకు వెళ్లగా సింగయ్య అనే కార్యకర్త కారు కింద పడి మరణించాడని, రోప్ పార్టీ లేకపోవడం వల్లే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నట్లు వైసీపీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇదే సమయంలో నెల్లూరు పర్యటనకు వెళతానంటే హెలిపాడ్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సహకరించడం లేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే జగన్ పర్యటన ఇప్పటికే వాయిదా వేయడం వల్ల పిటిషన్ నిరర్థకమైందని విచారించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. అయితే Z+ భద్రత నిరాకరించడం వల్లే జగన్ పర్యటన వాయిదా పడిందని, పిటిషన్ పై విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని వైసీపీ తరఫు న్యాయవాదులు కోరారు.
దీంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి Z+ సెక్యూరిటీ ఇస్తుంది, లేనిదీ స్పష్టమవుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన నుంచి తన భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. గుంటూరు మిర్చియార్డుకు వెళ్లిన సమయంలో ఆయనకు ఉన్న ప్రత్యేక భద్రత ఏర్పాట్లను ఉపసంహరించుకున్నారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జగన్ పర్యటనకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆయన గుంటూరు పర్యటనకు వెళ్లడంతో భద్రత తగ్గించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.