జగన్ లక్కీ నంబర్ అదే.. పాదయాత్ర అప్పుడే !
వైసీపీకి తొలిసారి 2019లో అధికారం దక్కింది. దాంతో 9వ నంబర్ అంటే ప్రేమ ఎక్కువ అని అంటారు. ఆ ధీమాతోనే 2029లోనూ తమదే అధికారం అని ఆ పార్టీ ఒట్టేసి మరీ చెబుతోంది అని కూడా అంటారు.;
రాజకీయాల్లో ఉన్న వారికి సెంటిమెంట్లు ఎక్కువ. ఫలానా రోజున ఎన్నికలు జరిగి ఫలానా రోజున కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయి అనుకుంటే ఆ డేట్ మీదనే మక్కువ చూపిస్తారు. అలాగే ఫలనా రోజున చేపట్టిన కార్యక్రమం హిట్ అయింది అని భావిస్తే ఆ డేట్ కోసమే ఆసక్తి చూపిస్తారు. ఇక వైసీపీ విషయానికి వస్తే కొన్ని నంబర్లను ఆ పార్టీ బాగా నమ్ముతుంది. అందులో 4 అయితే కచ్చితంగా లేదని అంటారు.
అందుకే నాలుగు వద్దు :
వైసీపీ పుట్టాక 2014 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడింది. అలాగే 2024లో కూడా అధికారంలో ఉంటూ వైసీపీ భారీ ఓటమిని మూటకట్టుకుంది. దాంతో ఈ రెండు చోట్లా చివరిలో నాలుగు ఉంది అని బ్యాడ్ నంబర్ గా చూస్తుంది అని అంటారు. పైగా 2024లో మరీ 11 సీట్లే వైసీపీకి వచ్చాయి అంటే డబుల్ ఫోర్లు ఉన్నాయని కూడా పార్టీ అనుమానిస్తోంది. దాంతో పాటుగా అచ్చి వచ్చిన నంబర్లుగా 7 ని అలాగే 9 ని నమ్ముతోంది.
అధికారం అందుకే :
వైసీపీకి తొలిసారి 2019లో అధికారం దక్కింది. దాంతో 9వ నంబర్ అంటే ప్రేమ ఎక్కువ అని అంటారు. ఆ ధీమాతోనే 2029లోనూ తమదే అధికారం అని ఆ పార్టీ ఒట్టేసి మరీ చెబుతోంది అని కూడా అంటారు. ఇక 2017 నవంబర్ 6 నుంచి జగన్ మహా పాదయాత్ర చేపట్టారు. ఈ మొత్తం నంబర్లు కలిపితే 9 వస్తుంది. అలాగే చివర 7వ నంబర్ ఉంది. దాంతోనే అన్నీ ఆలోచించిన మీదట జగన్ 2027 లో పాదయాత్ర అని డిక్లేర్ చేశారు అని అంటున్నారు ఇక ఇందులో 7వ నంబర్ ఉండడమే కారణం అంటున్నారు. అంతే కాదు 7వ నెల అయిన జూలై నుంచి పాదయాత్ర ఆ ఏడాది ప్రారంభించవచ్చు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇక తేదీలలో కూడా ఏడుని చూసుకుంటారా లేక మొత్తం రోజూ నెలా ఏడాది అన్నీ కలసి ఏడు అయినా తొమ్మిది అయినా నంబర్ వచ్చేలా చూసుకుని ఆ రోజు నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడతారా అన్నది కూడా చర్చగా ఉంది.
హిట్ కావాలంటూ :
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందు గతంలో జగన్ పాదయాత్ర చేసి హిట్ కొట్టారు, ఇపుడు కూడా అలాగే కాల పరిమితి చూసుకుని యాత్ర స్టార్ట్ చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అదే విధంగా పాదయాత్ర ఎక్కడ నుంచి చేపట్టాలి తూర్పు నుంచా లేక ఉత్తరం నుంచా అన్నది కూడా చర్చగా సాగుతోందిట. ఇలా తిధులు వారాలు లక్కీ నంబర్లు, వాస్తు, దిక్కులు అన్నీ చూసుకుని పకడ్బంధీగా జగన్ పాదయాత్ర సాగనుంది అని అంటున్నారు. చూడాలి మరి జగన్ పాదయాత్ర 2.0 ఏ విధంగా సక్సెస్ అవుతుందో మరి అని అంటున్నారు.