జగన్ లెక్కలు: జనాలకు ఎక్కుతాయా ..!
మనకు అనుకూల వాతావరణం ఏర్పడిందని.. ప్రజలు వైసీపీ కోసం ఎదురు చూస్తున్నారని కూడా ఆయన తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన సూచించారు.;
నాయకులు చెప్పే లెక్కలు ప్రజలకు ఎక్కాలి. పార్టీ అధినేతలు చెప్పే లెక్కలు.. ఇటు నాయకులకు, అటు ప్రజలకు కూడా చేరువ కావాలి. లేకపోతే.. మొత్తానికే మోసం ఖాయం. ఈ విషయం ఎందుకు చెప్పా ల్సి వస్తోందంటే.. తాజాగా మరోసారి వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో లెక్కలు కట్టారు. మనకు అనుకూల వాతావరణం ఏర్పడిందని.. ప్రజలు వైసీపీ కోసం ఎదురు చూస్తున్నారని కూడా ఆయన తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన సూచించారు.
అయితే.. వాస్తవానికి ఆయన ఈ సందర్భంగా చెప్పిన లెక్కలపై పార్టీ నాయకులే విస్మయం కలిగింది. ఎందుకంటే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై జగన్ అనుకుంటున్నట్టు.. లేదా ఆయనకు అందుతున్న సమాచారం మేరకు.. ప్రజల్లో వ్యతిరేకత భారీ పెరిగిపోయిందని అనుకుంటున్నారు. సూపర్ సిక్స్, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ప్రజల్లో పెద్దగా స్పందన లేదన్నది జగన్ చెబుతున్న మాట. ఆయనకు అందిన సమాచారం కూడా అలానే ఉందని తెలుస్తోంది.
దీంతో ఇంకేముంది.. వైసీపీ పుంజుకుందని.. ఇక, ఎప్పుడు ఎన్నికలు జరిగినా..తమదే గెలుపు అని కూడా ఆయన అంచనా వేసుకుంటున్నారు. ఇవే లెక్కలను ఆయన ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని కూడా తాజాగా నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు చెప్పారు. కానీ, వాస్తవం ఏంటి? అనేది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న నాయకులకు తెలుసు. కానీ, పాపం వారికి ఇంకా స్వేచ్ఛ రాలేదు. దీంతో ఎవరికి వారు జగన్ చెప్పింది విని.. తలలు ఊపి.. ఔను సర్! అనేశారు.
ఇక, జగన్ చెబుతున్నట్టు సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యాయా? అంటే.. కాదు. కొంత మేరకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. దీనికి కారణం.. కొందరికి నిధులు దక్కలేదు. మరికొందరు లబ్ధి దారుల జాబితాలో లేరు. ఇది వైసీపీ హయాంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతోంది. కానీ, అప్పట్లో అంతా బాగుందన్న వైసీపీ అధినేత ఇప్పుడుఅవే లోపాలు కనిపిస్తుంటే.. మాత్రం కూటమిపై రాళ్లే స్తున్నారు. ఇక, రైతులు తమ హయాంలో సుభిక్షంగా ఉన్నారన్న జగన్..ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కానీ.. వాస్తవానికి అప్పట్లోనూ రైతులు టమాటాలకు, ఉల్లిపాయలకు ధరలు లేక రోడ్లెక్కారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. కాబట్టి.. జగన్ చెబుతున్న లెక్కలు జనాలకు ఇప్పట్లో అయితే ఎక్కే పరిస్థితి లేదు. అంతేకాదు.. వైసీపీకి ఇప్పటికి తేడా కనిపిస్తోంది. పెట్టుబడులు వస్తున్నాయి. రహదారులు బాగవుతున్నాయి. ఇతర పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా ఉపాధి, ఉద్యోగాలపై నమ్మకం ఏర్పడుతోంది. ఈ పరిణామాలే.. ఇప్పుడు..కూటమికి మేలు చేస్తున్నాయి. ఈ విషయాలను వదిలేసిన జగన్ తన సొంత లెక్కలతో సంతసిస్తుండడం గమనార్హం.