జైలు పరామర్శ యాత్రలతో జగన్ బిజీ
ఓదార్పు యాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అన్నది తెలిసిందే. అప్పటిదాకా ఆ తరహా ఓదార్పులు ఉంటాయన్నది ప్రపంచానికి తెలియదు.;
ఓదార్పు యాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అన్నది తెలిసిందే. అప్పటిదాకా ఆ తరహా ఓదార్పులు ఉంటాయన్నది ప్రపంచానికి తెలియదు. ఆ తరువాత ఇదేదో బాగుందనుకుని ఇతర పార్టీలూ కొన్ని కాపీ కొట్టాయి. రాజకీయ కక్ష సాధింపు బాధితుల ఇళ్ళకు వెళ్ళి సొమ్ములు ఇవ్వడం కూడా జత చేసి మరీ ఇతర పార్టీలు తమ రాజకీయాన్ని పండించాయి. ఇక చూస్తే జగన్ మరో యాత్రకు బ్రాండ్ గా మారబోతున్నారా అన్నదే చర్చగా ఉంది.
జైలులో నేతలలో ములాఖత్ :
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరసబెట్టి వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు. దాంతో చాలా మంది జైలులో గడుపుతున్నారు. ఆ సమయంలో పార్టీ అధినేతగా జగన్ వారిని పరామర్శించాల్సి వస్తోంది. గుంటూరులో మాజీ ఎంపీ నందిగం సురేష్ పరామర్శతో మొదలెట్టిన జగన్ కు జైలు పరామర్శలు మరిన్ని ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గడం లేదని అంటున్నారు. పార్టీ అధినేతగా ఆయన తన బాధ్యతగా దానిని తీసుకుంటున్నారు అని అంటున్నారు.
జైళ్ళలో వరస ములాఖత్ :
నందిగం సురేష్ తరువాత విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు, ఓదార్చారు. ఆ తరువాత నెల్లూరు వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని ములాఖత్ ద్వారా పరామర్శించారు. ఇపుడు అదే నెల్లూరు జైలుకు మరోసారి ఆయన వెళ్ళబోతున్నారు. గత కొన్నాళ్ళుగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఉన్నారు. ఆయనను గత నెలలో పరామర్శించాలనుకున్నా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సరైన ప్లేస్ చూపించలేదని వాయిదా వేశారు. దీంతో సోమవారం జగన్ కాకాణిని పరామర్శిస్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
లిస్ట్ పెరిగిపోతోందిగా :
ఆ తరువాత వీలు చూసుకుని బుధవారం లోగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు జగన్ వస్తారు అని అంటున్నారు. అక్కడ తాజాగా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు అయి ఉన్నారు. దాంతో ఆయనను జగన్ పరమర్శిస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా అరెస్ట్ కత్తి వేలాడుతోంది అని ప్రచారంలో ఉంది. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని మహిళా నేత ఆర్కే రోజాలను సైతం అరెస్టు చేస్తారు అని ప్రచారం సాగుతోంది. దాంతో ఈ లిస్ట్ పెరిగిపోతే జగన్ పరామర్శల యాత్రల పర్వం కూడా కొనసాగుతుందని అంటున్నారు.
ఇదే పోరాటంగా మారిందా :
వైసీపీ అధినాయకత్వం చేస్తున్న పోరాటం ప్రజల కోసం అయి ఉంటే గ్రాఫ్ బాగా పెరిగేది అని అంటున్నారు. అయితే పార్టీ నేతలను అరెస్టు చేయడంతో వారిని పరామర్శిస్తూ వస్తున్నారు. దాంతో ఈ వైపుగానే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తోంది అని అంటున్నారు. దాంతో ప్రజా సమస్యల మీద ఆందోళనలు కొంత మరుగున పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పరామర్శలు వరకూ అధినాయకుని కన్సర్న్ ని చూపించినా న్యాయ పోరాటం గట్టిగా చేయడం ద్వారా జైలులో ఉన్న వారిని బయటకు తీసుకుని వచ్చేలా చేస్తే మేలు కదా అన్న సూచనలు వినవస్తున్నాయి. అయితే ఒకసారి పరామర్శ యాత్రలు మొదలెట్టాక ఒకరిని వదిలేసినా ఇబ్బందులు వస్తాయి. దాంతో జగన్ ఇపుడు అందరినీ పరామర్శిస్తూ జైలు యాత్రలు చేయాల్సిందే అన్న కామెంట్స్ వస్తున్నాయి.