జగన్ కోర్టుకు వచ్చే వేళ.. అంతమంది ఎక్కడ నుంచి వచ్చినట్లు?
ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ కు.. ఎయిర్ పోర్టు ఆవరణ మొత్తం జగన్ అభిమానులతో నిండిపోయింది.;
వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత నాంపల్లి కోర్టు పరిసరాల్లోకి వచ్చిన ఆయనకు వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలకటం.. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించటం చూసినోళ్లంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి.
పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఐదారు వందల మంది వరకు వస్తారని లెక్క కట్టిన దానికి భిన్నంగా అంతకు మూడు రెట్లు ఎక్కువగా అభిమానులు హాజరు కావటం.. వారిలో ఎక్కువ మంది చేతుల్లో రప్పా.. రప్పా ప్లకార్డులు ఉండటంతో.. ఈ రప్పా.. రప్పా బ్యాచ్ ఎక్కడోళ్లు అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ కు.. ఎయిర్ పోర్టు ఆవరణ మొత్తం జగన్ అభిమానులతో నిండిపోయింది. సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమాన అధినేతకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కోర్టుకు హాజరయ్యే వేళలో.. జగన్ వెంట వచ్చిన వారు వ్యవహరించిన తీరు చూసినప్పుడు రాజకీయ బలప్రదర్శనగా సాగిందే తప్పించి మరోలా లేదన్న మాట వినిపించింది.
తెలంగాణలో వైసీపీ లేనప్పటికీ.. జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారన్న అభిప్రాయం కలిగేలా గురువారం జరిగిన ర్యాలీ స్పష్టం చేసింది. ఇంత భారీగా కోర్టు వద్దకు చేరుకోవటంతో.. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? అన్నది ప్రాథమిక ప్రశ్నగా మారింది. పోలీసులు సైతం ఇదే అంశంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాంపల్లి కోర్టు వద్దకు.. బేగంపేట ఎయిర్ పోర్టు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానుల్లో అత్యధికులు హైదరాబాద్ కు వచ్చిన ఏపీ ప్రాంత వాసులుగా చెబుతున్నారు.
సాధారణంగా హైదరాబాద్ లో ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. నాంపల్లి కోర్టు వద్దకు వచ్చిన వారి వాహనాల్లో 90 శాతం ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలుగా చెప్పాలి. ఇదంతా చూస్తే.. కోర్టుకు హాజరయ్యే వేళలో వైసీపీ నేతలు ముందస్తు ప్లాన్ లో భాగంగా ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదంతా బాగానే ఉన్నా.. రప్పా.. రప్పా అంటూ ప్రదర్శించిన ప్లకార్డులే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోర్టుకు హాజరయ్యే వేళలో.. ఇంత భారీగా అభిమానులు న్యాయస్థానం వద్దకు రావాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న అయితే.. ఇదంతా బలప్రదర్శనలో భాగంగా వైసీపీ నేతలు పక్కాగా ప్లాన్ చేశారని వ్యాఖ్యలు చేస్తుంటే.. తమ అధినేత మీద ఉన్న అభిమానంతోనే స్వచ్చందంగా వచ్చినట్లుగా వైసీపీ చెబుతోంది. తమ అభిమాన అధినేత మీద అభిమానాన్ని ప్రదర్శించటం తప్పేం కాదు కానీ.. రప్పా.. రప్పా లాంటి ప్లకార్డులు లేకుండా మరింత హుందాగా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.