ఏదో ఒక‌టి మాట్లాడండి.. ఏం మాట్లాడ‌తాం స‌ర్‌: వైసీపీలో ఇంట్ర‌స్టింగ్ సీన్‌

అయితే.. ఈ సంద‌ర్బంగా ప‌లువురు నాయ‌కులు.. మాట్లాడుతూ.. ``ఏం మాట్లాడ‌తాం స‌ర్‌!. ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు.;

Update: 2025-10-05 01:45 GMT

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. శ‌నివారం అందుబాటులో ఉన్న కొద్ది మంది నాయకుల‌తో పార్టీ ఆఫీసు తాడేప‌ల్లిలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌జంగానే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా.. శ‌నివార‌మే సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ త‌దిత‌రులు `ఆటో డ్రైవ‌ర్ల సేవ‌లో..` పేరిట ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించిన త‌ర్వాత‌.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న డ్రైవ‌ర్ల‌కు రూ.15000 చొప్పున అందించే ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా ప్రారంభించారు. ఎక్క‌డా ఎలాంటి విమ‌ర్శ‌లు రాలేదు.

అంతేకాదు.. ఎవ‌రూ కూడా తాము అర్హుల‌మ‌ని.. అయినా.. త‌మ‌కు ప‌థ‌కంలో పేరు లేకుండా పోయింద‌ని కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌లేదు. మొత్తంగా ఈ ప‌థ‌కం శుభప్ర‌దంగా సాగిపోయింది. ఈ క్ర‌మంలో సాయంత్రం తాడేప‌ల్లిలో జ‌గ‌న్‌..త‌న‌కు స‌మీపంలో ఉన్న వారిని పిలిచి.. చిట్‌చాట్‌గా మాట్లాడార‌ని తెలిసింది. ఈ సంద‌ర్భంగా వారిని.. మీడియా ముందుకు వెళ్లాల‌ని.. ఏదో ఒక‌టి మాట్లాడాల‌ని సూచించారు. ``మ‌నం మీడియా స‌మావేశం పెట్టి.. ఏదో ఒకటి మాట్లాడాలి. లేక‌పోతే..వారు చెప్పేవే నిజ‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తారు. అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిపై స్పందించండి. మీకు స‌బ్జ‌క్టు కావాలంటే.. చెప్పండి.`` అని సూచించారు.

అయితే.. ఈ సంద‌ర్బంగా ప‌లువురు నాయ‌కులు.. మాట్లాడుతూ.. ``ఏం మాట్లాడ‌తాం స‌ర్‌!. ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఇప్పుడు మ‌నం ఇవ్వ‌ట్లేదంటే.. ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితిలో లేరు. కొంత వెయిట్ చేయాలి. ముందుగా మీరు రంగంలోకి దిగితే.. కొంత ఊపు వ‌స్తుంది.`` అని సూచించారు. దీనికి జ‌గ‌న్ స్పందిస్తూ.. ``నా గురించి ప‌క్క‌న పెట్టబ్బా.. ముందు మీరు మీడియా ముందుకు వెళ్లి.. ఏదో ఒక‌టి మాట్లాడండి. ప్ర‌జ‌ల‌కు కూడా నిజాలు తెలియాలి`` అన్నారు. మ‌నం ఏం మాట్లాడినా.. అటు నుంచి బ‌ల‌మైన కౌంట‌ర్ వ‌స్తోంద‌ని..గుంటూరుకు చెందిన ఓ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ నేత‌.. ఔను.. నిజ‌మే స‌ర్‌!. అని ముక్తాయించారు.

ఈ చ‌ర్చలు జ‌రుగుతున్న స‌మ‌యంలో..``ఈ రోజు జ‌రిగిన కార్య‌క్ర‌మానికి జ‌నాన్ని త‌ర‌లించారా? వారంత‌ట వారే వ‌చ్చారా? `` అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ``డ‌బ్బులు ఇచ్చే కార్య‌క్ర‌మం క‌దా.. స‌ర్‌.. వారే వ‌చ్చి ఉంటారు`` అని గుంటూరుకు చెందిన నేత‌, రోజులో ఎక్కువ స‌మ‌యం తాడేప‌ల్లి ఆఫీసులోనే ఉండే నాయ‌కుడు వ్యాఖ్యానించారు. ``మ‌నం ఇచ్చిన దానికంటే ఎక్కువ‌గా ఇస్తున్నారు. ఇప్పుడు మ‌నం ఏం చెప్పినా.. మ‌న‌కు మైన‌స్ వ‌స్తుంది.`` అని ఓ నేత వ్యాఖ్యానించారు. ఓ నాలుగు రోజులు మౌనంగా ఉంటేనే బెట‌ర్ అని అన్నారు. ఈ స‌మయంలోనే పేర్ని నాని ప్రెస్ మీట్ వ్య‌వ‌హారంపైనా చ‌ర్చించారు. దానిలో పెద్ద‌గా స‌బ్జెక్టు లేద‌ని ఓ నాయ‌కుడు అన‌డంతో.. ``పేర్ని చిన్న‌బుచ్చ‌కుంటాడు..`` అని జ‌గ‌న్ అన్నారు. దీంతో అంద‌రూ ఘొల్లున న‌వ్వారు. ఇదీ.. సంగతి!!.

Tags:    

Similar News