జగన్ పర్యటనకు షరతులు.. అనకాపల్లి టూరుపై వైసీపీ దూకుడు
తొలుత మాజీ సీఎంను రోడ్డు మార్గంలో పర్యటించేందుకు అనుమతించమని చెప్పిన పోలీసులు.. రాత్రి పొద్దుపోయిన తర్వాత కొన్ని షరతులు విధిస్తూ అనుమతిచ్చారు.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటన ఉత్కంఠ రేపుతోంది. తొలుత మాజీ సీఎంను రోడ్డు మార్గంలో పర్యటించేందుకు అనుమతించమని చెప్పిన పోలీసులు.. రాత్రి పొద్దుపోయిన తర్వాత కొన్ని షరతులు విధిస్తూ అనుమతిచ్చారు. అయితే తాము పోలీసులకు సమాచారం మాత్రమే ఇచ్చామని, అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా జగన్ రోడ్ షో నిర్వహిస్తారని వైసీపీ విస్పష్టంగా ప్రకటించడంతో రోజంతా టెన్షన్ కొనసాగింది. ఇక కరూర్ తొక్కిసలాటను ద్రుష్టిలో పెట్టుకుని జగన్ పర్యటనకు అనుమతివ్వలేమని చెప్పిన పోలీసులు చివరికి అంగీకరించడంతో విపక్షం పైచేయి సాధించినట్లైందని అంటున్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలనకు సిద్ధమయ్యారు. 9వ తేదీన నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం మెడికల్ కాలేజీ సందర్శనకు అనుమతి ఇవ్వాలని వైసీపీ పోలీసుశాఖకు లేఖ రాసింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి మాకవరపాలెం వరకు రోడ్డు మార్గంలో జగన్ పర్యటిస్తారని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ కోరింది. కాగా, జగన్ మాకవరపాలెం వెళ్లాలంటే రెండు జిల్లాల మీదుగా పర్యటన కొనసాగించాల్సివుంటుంది. విశాఖ విమానాశ్రయం నుంచి 11 కిలోమీటర్ల వరకు ఆ జిల్లా పరిధిలో మిగిలిన 52 కిలోమీటర్లు అనకాపల్లి జిల్లా పరిధిలో పర్యటనకు రూట్ మ్యాప్ ఖరారైంది.
అయితే జగన్ రోడ్డు షోకు అనుమతించలేమని, నేరుగా హెలికాఫ్టర్ లో మాకవరపాలెం వెళ్లాలని అనకాపల్లి జిల్లా పోలీసులు తెలిపారు. విశాఖ నుంచి మాకవరపాలెం గ్రామానికి 63 కిలోమీటర్ల దూరం ఉందని, ఈ మార్గంలో భారీ జనసమీకరణ జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో అనుమతి ఇవ్వలేమని అనకాపల్లి జిల్లా ఎస్పీ ప్రకటించారు. జగన్ పర్యటనకు వేలాది మంది తరలివస్తారని, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతోపాటు అంబులెన్సుల రాకపోకలకు సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎస్పీ తెలిపారు. ఈ కారణంగా రోడ్డు మార్గంలో అనుమతించలేమని, హెలికాప్టర్ లో వెళతామంటే అనుమతి ఇస్తామని వెల్లడించారు.
మరోవైపు జగన్ పర్యటనకు విశాఖ జిల్లాలో షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు కమిషనర్ శంకబ్రత బాగ్చీ తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి మీదుగా జగన్ పర్యటనకు అనుమతిస్తున్నట్లు మంగళవారం రాత్రి సీపీ ప్రకటించారు. అయితే ఇందుకు ట్రాఫిక్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని షరతు విధించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదని, పైలట్ ఎస్కార్ట్ సహా పది వాహనాలకు మాత్రమే కాన్వాయ్ లో అనుమతి ఇస్తున్నట్లు సీపీ తెలిపారు. ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలిగితే ఎలాంటి నోటీసులు లేకుండా పర్యటనకు బ్రేక్ వేస్తామని సీపీ హెచ్చరించారు.
మాకు పర్మిషన్ తో పనిలేదు : వైసీపీ
కాగా, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ రోడ్డు షో ఉంటుందని, ఎవరు అడ్డుకుంటారో చూస్తాని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం పర్యటన వివరాలను పోలీసులకు తెలిపామని, భద్రత కల్పించమని కోరినట్లు తెలిపారు. ‘మేం పర్మిషన్ కోసం పోలీసులకు లేఖ ఇవ్వలేదు. సమాచారం కోసం ఇచ్చాం. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు స్రుష్టించినా రోడ్డుషో ఉంటుందని అమరనాథ్ తేల్చి చెప్పారు.