వైసీపీ మాజీలు...దారి కనిపించడంలేదా...?

ఆయనకు కొంత పట్టుంది. పైగా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు ఆయన. ఆయనే చింతలపూడి వెంకటరామయ్య.;

Update: 2023-08-16 04:40 GMT

వైసీపీలో మాజీ ఎమ్మెల్యేలు గత నాలుగైదేళ్ళుగా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. అందులో ఒకాయన ఈ మధ్యనే జనసేనలోకి జంప్ అయిపోయారు. ఆయనే పంచకర్ల రమేష్ బాబు. ఆయన విశాఖ ఉత్తరం అయినా పెందుర్తి అయినా తనకు సీటు దక్కుతుందని ఆశపడ్డారు. అయితే ఆ రెండింటికీ వైసీపీ క్యాండిడేట్స్ ఎవరో చెప్పకనే చెప్పేసింది. దాంతో పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి విషయంలో హామీ తీసుకుని మరీ జనసేనలోకి వెళ్ళారని ప్రచారంలో ఉన్న మాట.

ఇదిలా ఉంటే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారు. వారంతా వచ్చే ఎన్నికల్లో తమకు ఏదైనా హామీ దక్కుతుందా అని ఎదురుచూస్తున్న వారే. ఇక అలాంటి వారిలో గాజువాక నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2004లో వైఎస్సార్ జమానాలో ఒకసారి పెందుర్తి నుంచి ఎమ్మెల్యే అయిన తిప్పల గురుమూర్తి రెడ్డి ఆ తరువాత ఎన్ని పార్టీలు మారినా కూడా మళ్ళీ చట్ట సభలోకి రాలేకపోతున్నారు. ఆయనకు టికెట్ విషయంలో ఏ పార్టీ హామీ ఇవ్వడంలేదు.

అలా తిప్పల తెలుగుదేశంలో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. ఆయన మనసు అంతా గాజువాక మీద ఉంది. అయితే జగన్ 2024లో ఆ టికెట్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇక గాజువాకకే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి మొదటిసారి గాజువాక నుంచి 2009లో గెలిచారు. ఆయనకు కొంత పట్టుంది. పైగా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు ఆయన. ఆయనే చింతలపూడి వెంకటరామయ్య.

ఆయన కూడా ఈసారి ఎలాగైనా గాజువాక నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరారు. గాజువాక టికెట్ అడిగితే పవన్ ఆయనకు పెందుర్తి టికెట్ కేటాయించి తాను గాజువాక నుంచి పోటీ చేశారు, ఓడారు. ఆ తరువాత గాజువాక టికెట్ తనకు రాదని తెలిసి ఆయన వైసీపీలో చేరారు.

ఇక ఇంకో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్. ఆయన విశాఖ ఉత్తరం లేదా సౌత్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు సౌత్ లో బలం ఉంది. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. అయితే ఆ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి జగన్ కేటాయించారని ప్రచారంలో ఉంది. దాంతో చివరి నిముషంలో ఏమైనా మార్పులు ఉంటాయేమో అని చూస్తున్నారు. లేకపోతే విశాఖ ఉత్తరం నుంచి అయినా పోటీ చేయాలని అనుకుంటున్నారు.

ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం పుట్టాక 2009లో ఫస్ట్ టైం అక్కడ నుంచి గెలిచిన వారుగా తైనాల విజయకుమార్ ఉన్నారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు టికెట్ తనకు దక్కలేదని టీడీపీలోకి జంప్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి మళ్లీ పార్టీలో చేరారు. ఆయన విశాఖ ఉత్తరం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ఉత్తరాంధ్రాకు చెందిన తన సొంత సామాజికవర్గానికి చెందిన మంత్రి గారి అండ ఉంది అని ప్రచారంలో ఉంది. ఆయన సామాజికవర్గం జనాభా విశాఖ ఉత్తరంలో చాలా మందే ఉన్నారు. దాంతో సమీకరణలు అనుకూలిస్తారు అని ఎదురుచూస్తున్నారు.

అదే విధంగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పాడేరు టికెట్ తన కుమార్తె కోసం కోరుతున్నారు. ఆయన సైతం జగన్ డెసిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా వీరంతా ప్రస్తుతం ఏమి చేస్తున్నారు అంటే పార్టీ ఆఫీసులో జరిగే జెండా వందనాలకు హాజరవుతున్నారు. అదే విధంగా పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. అయితే జగన్ మాజీలకు టికెట్లు ఇస్తారా లేదా అన్నది చూడాలి. అంతే కాదు కొత్త ముఖాల విషయంలో వైసీపీ అన్వేషిస్తోంది అంటే మాజీలకు ఏదైనా భరోసా ఇవాలి. లేకపోతే 2024 ఎన్నికల ముందు మాజీలు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News