ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పోస్టింగ్.. చివర్లో ట్విస్ట్..

సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2026-06-26 05:57 GMT

సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖలో జీపీఎం అండ్ ఏఆర్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పోస్టులో ఆమె కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నారు. ఈ నెల 30న శ్రీలక్ష్మి రిటైర్ కానున్నారు. దీంతో సీనియర్ అధికారిణిని గౌరవంగా పంపాలనే ఉద్దేశంతో రెండేళ్ల పంతం పక్కన పెట్టి పోస్టింగ్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శ్రీలక్ష్మి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెయిటింగ్ లోకి వెళ్లిపోయారు. దాదాపు రెండేళ్ల పాటు ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం శ్రీలక్ష్మి రిటైర్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని చివరి నాలుగు రోజుల పాటు విధులలోకి తీసుకుంది.

శ్రీలక్ష్మి పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం అఖిల భారత సర్వీసు అధికారుల గౌరవాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ఆమెకు పోస్టింగ్ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. శ్రీలక్ష్మి వివాదాస్పద వైఖరి వల్లే ఆమెకు రెండేళ్లుగా పోస్టింగు ఇవ్వలేదని చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మిపైనా ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్ కు ఎంపికైన శ్రీలక్ష్మిని 2019లో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీసుకువచ్చింది. ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగా, శ్రీలక్ష్మి హవా నడిచింది.

ఇక రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసులు ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు. 22 ఏళ్లకే అఖిల భారత సర్వీసుకు ఎంపికైన శ్రీలక్ష్మి సీనియార్టీ పరంగా చూస్తే కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా రిటైర్ అవ్వాల్సివుంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎంపిక అవ్వాల్సివుంది. అయితే ఆమెపై ఉన్న కేసుల కారణంగా కీలక పదవులకు అర్హత కోల్పోయారని అంటున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ తో శ్రీలక్ష్మికి సత్సంబంధాలు ఉన్నాయనే కారణంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని చెబుతున్నారు.

కానీ, ఆమె సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని చివర్లో పోస్టు ఇచ్చిందని చెబుతున్నారు. దీనివల్ల శ్రీలక్ష్మి రిటైర్మెంట్ ప్రయోజనాలకు కూడా లైన్ క్లియర్ అయినట్లేనని చెబుతున్నారు. ప్రభుత్వం పంతానికి వెళ్లి పోస్టింగు ఇవ్వకపోతే అఖిల భారత సర్వీసు అధికారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని ప్రభుత్వం భావించిందని అంటున్నారు. దీంతో రాగద్వేషాలకు అతీతంగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ నియామకం గత ప్రభుత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ రిటైర్మెంటును గుర్తు చేస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటారనే భావనతో గత ప్రభుత్వం ఆయనను పూర్తిగా పక్కన పెడితే న్యాయపోరాటం చేసి పోస్టింగు తెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు. కానీ, శ్రీలక్ష్మితో ప్రస్తుత ప్రభుత్వం అలాంటి వివాదం పెట్టుకోకుండా గౌరవంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేయడమే హాట్ టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News