డీలిమిటేషన్: ఆ 2 అంశాలే.. అతి పెద్ద కుట్ర.. నిజమేనా?
పార్లమెంటులో మహిళా సవరణ బిల్లు(దీనినే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొంటున్నారు) వీగి పోయింది.;
పార్లమెంటులో మహిళా సవరణ బిల్లు(దీనినే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొంటున్నారు) వీగి పోయింది. మరి ఇది ఎందుకు వీగిపోయిందనే ప్రశ్నపై చాలా లోతైన చర్చ జరగాల్సి ఉంది. పైపైకి కొన్ని పార్టీలు.. కొందరు బలమైన నాయకులు చెబుతున్న విషయాలు చూస్తే.. వాస్తవాలు తెరమరుగు అవుతున్నాయి. దీంతో లోతుగా పరిశీలిస్తే.. 2 కీలక విషయాలు కనిపిస్తున్నాయి. ఇవే.. ఈ మొత్తం వ్యవహారాన్ని యూటర్న్ తీసుకునేలా చేశాయి.
1) జనాభా సంఖ్య ప్రాతిపదిక: మహిళా రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన అమలు చేస్తామని పేర్కొనడం. అయితే.. ఈ విషయంలో కేంద్రం నర్మగర్భంగా వ్యవహరించింది. వాస్తవం ఏంటంటే.. 1971లో తొలి సారి రాజ్యాంగ సవరణ చేసి.. దేశంలో నియోజకవర్గాలపునర్విభజన తీసుకువచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయని.. జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ వస్తాయని వాదించారు.
దీనిపై అప్పట్లోనే చర్చించిన పార్లమెంటు.. జనాభా సంఖ్య ఆధారంగా.. నియోజకవర్గాల పెంపు.. అనే విషయంపై `ఫ్రీజింగ్` విధించింది. ఇది.. రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. ఇది ఇందిరాగాంధీ హయాం వరకు కొనసాగింది. ఆ తర్వాత.. తరచుగా నియోజకవర్గాలను పెంచుతుండడాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం నివారించాలని భావించింది. ఈ క్రమంలో నియోజకవర్గాల పెంపుపై 25 ఏళ్ల వరకు.. గడువు విధించింది. అంటే.. జనాభా సంఖ్య ఆధారంగా నియోజకవర్గాలు ఏర్పడకపోవడంతోపాటు.. 25 ఏళ్ల వరకు.. నియోజకవర్గాల జోలికి వెళ్లడానికి వీల్లేదు.
ఇలా.. 2001 వరకు ఈ వ్యవహారం కొనసాగింది. ఆ తర్వాతే.. అంటే.. 2002లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాలను విభజించారు. అయితే.. తాజాగా కేంద్రం తెచ్చిన డీలిమిటేషన్ బిల్లులో ఈ 25 సంవత్సరాల గడువును ప్రస్తావించలేదు. (అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నియోజకవర్గాలను పెంచేసుకోవచ్చు.) అదే సమయంలో జనాభా సంఖ్య ఆధారంగా నియోజకవర్గాలను పెంచరాదన్న ఫ్రీజింగ్‌ను ఎత్తేసింది. ఇది ఒకటి కీలక అంశం.
2) జనాభా సంఖ్య ఆధారంగా నియోజకవర్గాలను విభజిస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనను తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని కేంద్రం చిలకపలుకులు పలికింది. అంతేకాదు.. కేంద్ర మంత్రి అమిత్ షా సహా..ప్రధాని మోడీలు.. 50 శాతం మేరకు.. సీట్లు పెంచుతామని ప్రకటించారు. ఇది వాస్తవమేనా? అంటే.. ఇది వాస్తవమైతే.. ఈ విషయాన్ని తాజా బిల్లులో పేర్కొనాలి. కానీ.. ఈ విషయాన్ని ఎక్కడా బిల్లులో పేర్కొనలేదు.
అంటే.. ఇప్పుడు కేంద్రం తెచ్చిన బిల్లును యథాతథంగా పార్లమెంటు ఆమోదిస్తే.. కేంద్ర పెద్దలు చెప్పిన 50 శాతం మాట కేవలం `హామీ`గా మారుతుంది. ఒకవేళ రేపు బిల్లులు అయిపోయి.. అమల్లోకి వచ్చాక.. 50 శాతం విషయాన్ని క్లాజులో చేర్చినా.. అది చట్టంలో ఉండదు. రాజ్యాంగంలోనూ ఉండదు. దీనిపై ఎవరైన న్యాయ పోరాటం మొదలు పెడితే.. చట్టంలో లేదు కాబట్టి.. 50 శాతం వర్తించదని కోర్టులు చెబితే.. ఆ వెంటనే.. అదిరద్దవుతుంది. తద్వారా.. చిన్న రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇదీ.. రెండో కారణం. ఈ రెండు అంశాలను అర్ధం కాకుండా.. అత్యంత గోప్యంగా ఉంచి.. కేంద్రం చేసిన ప్రయత్నమే వికటించింది.