బీజేపీ ప్లాన్ బీ... ఎన్నికల్లో కలిసి వస్తుందా ?
మహిళా రిజర్వేషన్ బిల్లు అయితే లోక్ సభలో వీగిపోయింది. అయితే బీజేపీ తన రాజకీయ వ్యూహం తో గెలిచేందుకు చూస్తోంది.;
మహిళా రిజర్వేషన్ బిల్లు అయితే లోక్ సభలో వీగిపోయింది. అయితే బీజేపీ తన రాజకీయ వ్యూహం తో గెలిచేందుకు చూస్తోంది. తన కత్తికి రెండు వైపులా పదును ఉందని బీజేపీ చాటి చెబుతోంది. బిల్లు నెగ్గితే ఈపాటికి సంబరాలు చేసుకునేది. కానీ బిల్లు వీగింది. ఇపుడు కూడా కమలం పార్టీ మాత్రం కలవరపడడం లేదు. ప్లాన్ బీ ని బయటకు తీస్తోంది. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు అన్నీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకం అని దేశం మొత్తం ప్రచారం చేయబోతోంది. ఆ విధంగా కాంగ్రెస్ ని ఇండియా కూటమిని జనం ముందు దోషులుగా నిలబెట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది.
భారీ వ్యూహంతోనే :
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తరువాత ఎన్డీయే అయితే మండిపడుతోంది. ఇండియా కూటమి మీద తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. ఈ బిల్లును ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ అడ్డుకున్నాయని ఎన్ డీయే ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఏకంగా మహిళా ఓటర్ల వద్దకు తీసుకువెళ్తామని కూడా ఎన్ డీయే భీషణ ప్రతిజ్ఞ చేసింది. ముందు ముందు ఇండియా కూటమి పార్టీలకు మహిళల నుంచి ఆగ్రహం తప్పదని కూడా హెచ్చరిస్తోంది. కేవలం ఇపుడే కాదు 2029 లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని అమిత్ షా హెచ్చరించారు.
బలమైన ముద్ర వేస్తూ :
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ మిత్రులను ఏకంగా మహిళా జనంలో వ్యతిరేకులుగా చేయాలని ఎన్డీయే ప్లాన్ బీని గట్టిగా దట్టించింది. ఆ విధంగా శాశ్వత రాజకీయ ఇష్యూగా మార్చాలని కూడా చూస్తోంది. అంటే రేపటి ఎన్నికలే కాదు ఎప్పటికీ కాంగ్రెస్ మీద ఈ ముద్ర ఉంచాలని చూస్తోంది అన్న మాట. కాంగ్రెస్ దాని మిత్ర పార్టీలు అన్నీ మహిళా సాధికారతకు వ్యతిరేకమని చిత్రీకరించడంపైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇపుడు దృష్టి సారించింది.
ఆ రెండు రాష్ట్రాలలో :
ఇక ఈ నెల 23, 29లలో జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇష్యూని జనం ముందు ఉంచి మహిళా ఓట్లను ఈ పార్టీలకు దక్కకుండా చేయాలని కూడా ఎన్డీయే భారీ వ్యూహ రచన చేస్తోంది. ప్రచారానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉండడంతో ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తోంది. గతంలో మహిళా బిల్లుని అడ్డుకుని సమాజ్ వాద్ పార్టీ, లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ రాజకీయంగా కొంత ఇబ్బంది పడ్డాయన్నది చరిత్ర చెబుతున్న నిజం. ఇపుడు అదే మాదిరిగా కాంగ్రెస్, డీఎంకే టీఎంసీ లకు కూడా మహిళా బిల్లుతోనే చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది. 2029 ఎన్నికల్లో మహిళా గ్రహం అంటే ఈ బిల్లు అప్పటికి కూడా చట్టం కాదని ఎన్డీయే నేతలు చెప్పేస్తున్నారు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.