రంగంలోకి.. కూతుళ్లు, కోడళ్లు, భార్యలు : 2029లో మారనున్న సీన్

ఇక మహిళా రిజర్వేషన్ అమలు అయితే తమ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనతో ఉన్న కొందరు నేతలు కుటుంబంలోని మహిళలను తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు.

Update: 2026-05-25 19:30 GMT

రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా అధికార టీడీపీతోపాటు విపక్ష వైసీపీలోనూ కొత్త నాయకుల సందడి ఎక్కువవుతోంది. ప్రధానంగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్న నాయకులతోపాటు మహిళా రిజర్వేషన్ అమలు అయితే పదవులు తమ కుటుంబం నుంచి జారిపోకుండా చూసుకునేందుకు నాయకులు ముందు జాగ్రత్త పడుతున్నారు. దీంతో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు రెండు పార్టీల్లోనూ కూతుళ్లు, కోడళ్లు, భార్యలు హల్ చల్ చేస్తున్నారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. గతంలోనే మహిళా రిజర్వేషన్ ను ఆమోదించినా, జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాతే రిజర్వేషన్ అమలు చేయాలని మెలిక పెట్టింది. అయితే ఇటీవల నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును విపక్షాలు తిరస్కరించడంతో కేంద్రం మళ్లీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు. ఈ సారి విపక్షాల చేసిన సూచనలను బిల్లులో చేర్చాలని కేంద్రం భావిస్తోందని చెబుతున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా రిజర్వేషన్ల అమలు అవుతుందని నేతలు భావిస్తున్నారు.

ఇక మహిళా రిజర్వేషన్ అమలు అయితే తమ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనతో ఉన్న కొందరు నేతలు కుటుంబంలోని మహిళలను తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు. వయోభారంతో వచ్చే ఎన్నికలలో పోటీకి అవకాశం దక్కదనే ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యేలలో చాలా మంది ముందుజాగ్రత్తగా తమ వారసులుగా కూతుళ్లు, కోడళ్లను ప్రజలకు పరిచయం చేసే పనిని వేగవంతం చేశారని అంటున్నారు. రెండు పార్టీల్లోనూ నేతలు ఒకే రకమైన ఆలోచనతో వ్యవహరిస్తుండటం వల్ల ఇటీవల యువ మహిళా నాయకుల సందడి ఎక్కువ అవుతోందని అంటున్నారు.

రెండు రోజుల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె లక్ష్మీ హైందవి అనూహ్యంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పార్టీ నేతలతో తనకు ఉన్న పరిచయాలతోపాటు ప్రజల సమస్యపై అవగాహనను చాటిచెప్పుకునే ప్రయత్నం చేశారు. కోటంరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన బదులుగా తమ్ముడు గిరిధర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి ఇప్పటికే కోరినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బంది తలెత్తకూడదన్న ఆలోచనతో పెద్ద కుమార్తె లక్ష్మీ హైందవిని రాజకీయాల్లోకి తెస్తున్నారని అంటున్నారు.

నెల్లూరు జిల్లాలో మరికొందరు నేతలు కూడా మహిళా కోటా ఆలోచనతో తమ కుమార్తెలను తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు. వీరిలో మంత్రి ఆనం కుమార్తె కైవల్లారెడ్డి, మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కర్నూలుకు చెందిన ఎస్వీ విజయ మనోహరి, ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికా రెడ్డి వంటివారు రిజర్వేషన్ ఆశలతో రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారని చెబుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె బగ్గు అర్చన, విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి బొత్స కుమార్తె అనూష కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. వీరే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకుల వారసులుగా తమ కుమార్తెలు, కోడళ్లు, భార్యలను రంగంలోకి దింపుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News