మామిడి పండ్లు తింటే కురుపులు, మొటిమ‌లు.. ఇలా చేస్తే ఆ స‌మ‌స్యే లేదు!

ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో రసాయన ఎరువులు, పురుగుమందులు.. పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను వాడుతున్నారు.;

Update: 2026-05-05 18:30 GMT

వేసవి కాలం రాగానే నోరూరించే మామిడి పండు కోసం ఎదురుచూడని వారు ఉండరు. అయితే పండు చేతికి చిక్క‌గానే అబ‌గా తినేయ‌డం స‌రైన ప‌ద్ధ‌తేనా? అంటే కానే కాద‌ని చెప్పాలి. ఇన్నేళ్ల‌లో మామిడి పండ్ల‌ను ఎలా తినాలో తెలియ‌కుండానే మ‌నం తింటూనే ఉన్నాం.

నిజానికి మన పూర్వీకుల కాలం నుండి ఇంట్లో పెద్దలు మామిడి పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం ఆన‌వాయితీ. ఏదో శుభ్రత కోసం చేస్తున్న పని అని మనం భావిస్తుంటాం కానీ.. దీని వెనుక అస‌లు కార‌ణం వేరు. ఈప‌ని వెన‌క‌ బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు (జీర్ణకోశ నిపుణులు) స్పష్టం చేస్తున్నారు. మామిడి పండ్లను తినడానికి కనీసం 30 నిమిషాల ముందు నీళ్లలో నానబెట్టడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు... అది మన శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడానికి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఒక కీలకమైన ప్రక్రియ.

మామిడి పండ్లలో `ఫైటిక్ యాసిడ్` అనే ఒక రకమైన యాంటీ-న్యూట్రియంట్ (పోషక విరోధి) ఉంటుంది. ఇది మన శరీరంలో చేరినప్పుడు క్యాల్షియం, ఇనుము, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలను రక్తంలోకి శోషించబడకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల మనం ఎంత మంచి పండు తిన్నా.. అందులోని పూర్తి స్థాయి పోషకాలు శరీరానికి అందవు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ప్రతీక్ శర్మ వివరణ ప్రకారం.. మామిడి పండ్లను 30 నిమిషాల నుండి గంట పాటు నీటిలో నానబెట్టడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ ప్రభావం తగ్గిపోతుంది. తద్వారా పండులోని మెగ్నీషియం, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలను శరీరం సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది.

మరో ప్రధానమైన అంశం `థర్మోజెనిసిస్` లేదా శరీర ఉష్ణోగ్రత పెరగడం. మామిడి పండ్లు సహజంగానే శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. అధిక వేడి వల్ల చర్మంపై కురుపులు, మొటిమలు రావడం మనం గమనిస్తుంటాం. అంతేకాకుండా ఇది ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల వాటిలోని సహజమైన వేడి త‌గ్గిపోతుంది. ఈ ప్రక్రియ వల్ల పండు శరీర ఉష్ణోగ్రతతో సమతుల్యం చెంది.. వేసవి తాపానికి తట్టుకునేలా మన జీర్ణవ్యవస్థను రక్షిస్తుంది. పండులోని వేడి తగ్గడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో రసాయన ఎరువులు, పురుగుమందులు.. పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను వాడుతున్నారు. కేవలం నీటితో కడిగితే ఈ రసాయన అవశేషాలు పూర్తిగా పోవు. అరగంట పాటు నీటిలో ముంచడం వల్ల ఆ రసాయనాలు, పురుగుమందులు.. పండు కాడ వద్ద ఉండే జిగురు పూర్తిగా తొలగిపోతాయి. ఈ జిగురులో `ఉరుషియోల్` అనే అలర్జీ కలిగించే పదార్థం ఉంటుంది. ఇది నోటి చుట్టూ దురద లేదా గొంతులో మంటను కలిగిస్తుంది. నీటిలో నానబెట్టడం వల్ల ఈ ప్రమాదకరమైన వ్య‌ర్థాల నుండి మనకు రక్షణ లభిస్తుంది.

నీటిలో నానబెట్టడం వల్ల మామిడి పండు రుచి, ఆకృతి కూడా మెరుగుపడతాయి. రవాణా - నిల్వ సమయంలో తేమను కోల్పోయిన పండు నీటిలో ఉండటం వల్ల మళ్ళీ తాజాగా మారుతుంది. తొక్క తీయడం సులభతరం కావడమే కాకుండా.. పండు గుజ్జు జ్యుసీగా మారుతుంది. కాబట్టి మామిడి పండును కొన్న వెంటనే తినేయాలనే తొందరను పక్కన పెట్టి కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. రుచిక‌ర‌మైన ఫ‌లం అందించే పూర్తి స్థాయి పోషకాలను శ‌రీరానికి అందించ‌గ‌లం.

Tags:    

Similar News