ట్రంప్ ఎఫెక్ట్: శ్వేత సౌధం.. స్వర్ణమయం!
ఇలా ప్రసిద్ధి చెందిన వైట్ హౌస్.. ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో స్వర్ణమయం కానుంది.;
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేత సౌధం.. దీనినే వైట్ హౌస్ అంటారు. ఏ పార్టీకి చెందిన అధ్యక్షుడు అయినా.. దీని లోనే నివాసంతో పాటు.. కార్యాలయం, సమావేశాలు నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన అధికారిక నివాసంగా ఇది గుర్తింపు పొందింది. అంతేకాదు.. 24 గంటలూ.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. జామర్లు కూడా ఉంటాయి. శ్వేత సౌధం పైనుంచి ఒక్క విమానాన్ని కూడా అనుమతించరు. ఇక, ఈ వైట్ హౌస్ చుట్టూ.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నియంత్రణతో పాటు.. కట్టుదిట్టమైన గోడలు, కంచెలు ఉంటాయి. అనుమతి ఉంటే తప్ప.. ఈగను కూడా లోపలకు అనుమతించరు.
ఇలా ప్రసిద్ధి చెందిన వైట్ హౌస్.. ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో స్వర్ణమయం కానుంది. అంటే.. భారత దేశంలో ఆలయాల గోపురాలను బంగారు తాపడంతో అలంకరించినట్టుగా శ్వేత సౌధం మొత్తాన్నీ కూడా స్వర్ణ మయం చేయనున్నారు. దీనికి అత్యంత ఖరీదైన 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా `ట్రూత్ పోస్ట్`లో వెల్లడించారు. అంతేకాదు.. ప్రపంచ దేశాల కీలక నేతలు సైతం అత్యంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా.. అసూయ చెందేలా కూడా ఈ బంగారు తాపడం పనులు జరుగుతున్నట్టు తెలిపారు.
ఇప్పటికే.. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్‌లో భారీగా స్వర్ణ అలంకరణలు చేపడుతున్న వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ పోస్టులో షేర్ చేశారు. ''ఇప్పటి వరకు అందమైన భవనంగా పేరుపొందిన వైట్ హౌస్.. ఇక నుంచి అత్యుత్తమమైన భవనంగా మారనుంది. ఇక్కడికి వచ్చిన విదేశీ నేతలను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా చేస్తుంది. ఈ అలంకరణకు మేలిమి బంగారాన్ని వినియోగిస్తున్నాం. ఈ సౌందర్యం చూసి ఏ విదేశీ నాయకుడైనా ఆశ్చర్యపోవాల్సిందే.'' అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం లోపలి నిర్మాణాలను మాత్రమే 24 క్యారెట్ల బంగారంతో అలంకరిస్తున్నా.. భవిష్యత్తులో బయటి ప్రాంతాలను కూడా స్వర్ణంతో తీర్చిదిద్దనున్నారు.
ఖర్చు ఎవరిది?
వైట్ హౌస్ అనేది ఎవరి సొంతమూ కాదు. అది అమెరికా ప్రజల ఆస్తి. దీంతో ఈ నిర్మాణాలకు అయ్యే వ్యయం సహజంగా ఖజానా నుంచే ఖర్చు చేయాలి. కానీ, ట్రంప్ ఈ విషయంలో తానే ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇంటా బయట కూడా.. దీనికి అయ్యే ఖర్చును తానే భరిస్తున్నానని.. అమెరికా అధ్యక్ష భవనం అంటే.. ఒక డిగ్నిటీ ఉండాలని ఆయన ప్రకటించారు. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేపు వచ్చే ఎన్నికల్లో ట్రంప్ అధికారం నుంచి దిగిపోతే.. అప్పుడు ఆయన వీటిని వలుచుకుని వెళ్లిపోతారని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు.. జాతి సంపదగా దీనిని వదిలేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరికొందరు.. ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగి.. ధరలు ఆకాశానికి అంటుతున్న సమయంలో శ్వేత సౌధానికి చేసే ఖర్చుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.