జగన్ పక్కన ఆయన మిస్...నిజమేనా ?

వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జగన్ స్వయంగా హాజరయ్యారు చాలా కాలం తరువాత ఇది జరిగింది అని అంటున్నారు.;

Update: 2026-03-13 03:02 GMT

వైసీపీలో ఏమి జరుగుతోంది, అసలు ఏ రకమైన సమీకరణలు పనిచేస్తున్నాయి. ఈ ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. వైసీపీ 16 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను అధినేత జగన్ ఆవిష్కరించారు. ఆయన స్పీచ్ కూడా ఇచ్చారు. అయితే జగన్ పక్కన ఆయన మిస్ అని సోషల్ మీడియాలో ప్రచారం అయితే వైరల్ గా మారింది. ఎవరాయన ఏమిటి కధ అంటే దాని మీదేనే బోలెడు చర్చలు సాగుతున్నాయి.

చాలా కాలం తరువాత :

వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జగన్ స్వయంగా హాజరయ్యారు చాలా కాలం తరువాత ఇది జరిగింది అని అంటున్నారు. గత ఏడాది అయితే జగన్ హాజరు కాలేదు, పార్టీ సీనియర్ నేతల సమక్షంలోనే ఈ కార్యక్రమం సాగింది. కానీ ఈసారి జగన్ రావడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులలో జోష్ పెరిగింది. జగన్ ఇచ్చిన స్పీచ్ కానీ ఆయన పార్టీ మీద కురిపించిన ప్రేమ కానీ చూస్తే భావోద్వేగాన్ని పెంచాయని అంటున్నారు. వైసీపీని ఒంటరిగా ఒక్కడిగా పెట్టాను అని జగన్ అన్నారు ఈ రోజున తన వెనక కోట్లాది మంది ఉన్నారని జగన్ ఎమోషనల్ గా చెప్పిన మాటలు క్యాడర్ ని ఉర్రూతలూగించాయి.

జగన్ పక్కన వారు :

ఇక జగన్ పక్కన వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అలాగే విజయవాడకు చెందిన పార్టీ కీలక నేత దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు. అయితే వైసీపీకి సర్వం సహా అన్నీ తానే అయి చూసే సజ్జల రామకృష్ణారెడ్డి ఏరీ అని అంతా చర్చించుకోవడం జరుగుతోందిట. సజ్జలను వైసీపీ ప్రభుత్వంలో ఉన్నపుడు సకల శాఖల మంత్రిగా సెటైర్లు వేసేవారు. ఇక విపక్షంలోనూ ఆయన హవాయే సాగుతోంది అని పార్టీలో లోలోపల గుసగుసలు పోయేవారు పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి లాంటి వారు అయితే ఆయన పేరు ఎత్తకుండా జగన్ చుట్టూ కోటరీ అని హాట్ కామెంట్స్ చేసేవారు మరి ఇవన్నీ పనిచేశాయా లేక వైసీపీలో భారీ ప్రక్షాళన చేస్తున్నారా అన్నది తెలియదు కానీ సజ్జల అయితే జగన్ పక్కన కనిపించకపోవడంతో పార్టీ కేంద్ర స్థాయి నుంచే భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారని అంటున్నారు.

ఉగాది నుంచి మార్పులు :

ఇక చూస్తే వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది నుంచి భారీ మార్పులు ఉంటాయని ప్రచారం సాగుతోంది. బీసీ నేతంకు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్ర కు చెందిన ఒక మాజీ మంత్రి పేరు ఈ పదవి కోసం సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉన్న ఆ సీనియర్ నేత అయితే కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిభాయించగలరని అంటున్నారు అంతే కాదు పార్టీలో ఇతర నేతలకు విభిన్న సామాజిక వర్గం వారికి పెద్ద పీట వేయడం ద్వారా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ని ఆయా సెక్షన్లలోకి పంపాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది అని అంటున్నారు. మరి వైసీపీలో ఈ మార్పు చేర్పులలో భాగంగా సజ్జలను దూరం పెడుతున్నారా లేక ఆయన కనిపించకపోవడం యాధృచ్చికమా అన్నది మాత్రం తెలియడం లేదు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News