బెంగాల్ లో రికార్డు బద్దలు కొట్టిన పోలింగ్...ఎవరికి ప్లస్ ?

మహా జంగిల్ రాజ్ అంటే అరాచక పాలనకు కాలం చెల్లిపోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు.;

Update: 2026-04-24 07:29 GMT

మహా జంగిల్ రాజ్ అంటే అరాచక పాలనకు కాలం చెల్లిపోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఏకంగా 92 శాతం పైగా పోలింగ్ పశ్చిమ బెంగాల్ లో మొదటి విడత జరిగింది. దాంతో మోడీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో మొదటి విడతలో నమోదైన భారీ ఓటింగ్ శాతాన్ని ఆయన విశ్లేషిస్తూ మార్పు కోసం ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పుగా అభివర్ణించారు. మే 4వ తేదీన అంటే ఓట్ల లెక్కింపు జరిగే రోజున పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి చెందిన పదిహేనేళ్ళ ఏళ్ల సిండికేట్ వ్యవస్థ అలాగే మమత అరాచక పాలన అంతం అవుతుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

భారీ స్థాయిలోనే :

ఇక గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పశ్చిమ బెంగాల్ 92.72 శాతం ఓటింగ్ శాతంతో రికార్డు సృష్టించింది. మొదటి దశలో, పశ్చిమ బెంగాల్‌లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నమోదైన ఓటింగ్ శాతం అత్యధికంగా ఇప్పటిదాకా అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఆ రాష్ట్రంలో నమోదైన అత్యధిక శాతం ఇదేనని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాల్లో మిగిలిన 142 స్థానాలకు సంబంధించిన రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. దాతొ కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.

అక్కడే అమిత్ షా మకాం :

ఇక పశ్చిమ బెంగాల్ ని బీజేపీ ఎంత ప్రతిష్ట గా తీసుకుంది అన్నది మరోసారి అర్ధం అయింది. ఏకంగా కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అయిన అమిత్ షా అక్కడే ఉన్నారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోనే మకాం వేసి ఉన్నారు. అమిత్ షా పోలింగ్ జరుగుతున్న సమయంలో సాల్ట్ లేక్‌లోని బీజేపీ ఎన్నికల నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి పార్టీ నాయకులతో కలిసి అక్కడి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. అంతే కాదు సున్నితమైన ప్రాంతాలలో కీలక స్థానలలో కేంద్ర బలగాలు కూడా మోహరించారు. దాంతో ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేనంత సాఫీగా సజావుగా సాగాయని చెబుతున్నారు.

మళ్ళీ మేమే :

ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ఇంత అధిక పోలింగ్ తమకే అనుకూలం అని అంటున్నారు. ప్రజలు అంతా తమ పాలనను మెచ్చి ఓట్లు వేశారని చెబుతున్నారు. రెండో విడత కూడా ఇదే జోరుతో జనాలు ఓటెత్తుతారు అని తామే వరసగా నాలుగవసారి అధికారంలోకి వస్తున్నట్లుగా చెప్పారు. అయితే మే 4న సీట్లు తింటూ పండుగ చేసుకుందామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి స్వీట్లూ సీట్లూ ఎవరికి దక్కుతాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News