బెంగాల్ యాంటీ సెంటిమెంట్....బీజేపీని భయపెడుతోందా ?
పశ్చిమ బెంగాల్ కి రాజకీయంగా యాంటీ సెంటిమెంట్ ఒకటి ఉంది అని చెబుతున్నారు. బెంగాల్ లో అధికారంలో ఉన్న పార్టీకి కేంద్రంలో ఎపుడూ ప్రతిపక్షమే ఉంటూ వచ్చింది.;
పశ్చిమ బెంగాల్ కి రాజకీయంగా యాంటీ సెంటిమెంట్ ఒకటి ఉంది అని చెబుతున్నారు. బెంగాల్ లో అధికారంలో ఉన్న పార్టీకి కేంద్రంలో ఎపుడూ ప్రతిపక్షమే ఉంటూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రం రాష్ట్రం మధ్య భారీ పొలిటికల్ వార్ సాగుతూ వచ్చింది. ఇది గడచిన యాభై ఏళ్ళుగా సాగుతూ వస్తున్న రాజకీయ చిత్రం. 1977 ముందు వరకూ బెంగాల్ ని కాంగ్రెస్ ఏలింది. అంటే గట్టిగా మూడు దశాబ్దాలు అన్న మాట. అపుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో కాంగ్రెస్ పార్టీయే ఉంటూ వచ్చింది. ఎప్పుడైతే వామపక్షాల నాయకత్వంలో బెంగాల్ లో ప్రభుత్వం ఏర్పాటు అయిందో నాటి నుంచి కేంద్రంలో వేరే పార్టీ ప్రభుత్వాలు ఉంటూ వచ్చాయి. అలా ప్రతిపక్షమే బెంగాల్ లో అధికారంలో గత యాభై ఏళ్ళుగా ఉంటూ వస్తోంది.
కేంద్రంతో ఢీ :
జ్యోతి బసు బెంగాల్ సీఎం గా ఉన్నా ఆయన వారసుడు బుద్ధ దేవ్ భట్టాచార్య సీఎం అయినా కేంద్రంలోని ప్రభుత్వాలతో ఢీ కొట్టారు. బెంగాల్ అభివృద్ధి అస్తిత్వం అన్న ఆయుధాలతో వారు నిరంతరం పనిచేసేవారు. అలా రాజకీయాల్లో భావోద్వేగాలకు ఎపుడూ చోటు ఉంటూ వచ్చింది. ఇక మమతా బెనర్జీ విషయం తీసుకుంటే ఆమె మూడు సార్లు సీఎం అయ్యారు, ఆ సమయంలో కొంతకాలం యూపీయే తప్ప మిగిలిన 12 ఏళ్ళ పోరాటం అంతా కేంద్రంలోని నరేంద్ర మోడీతోనూ బీజేపీతోనూ సాగిస్తూ వచ్చారు. అలా తాను బెంగాల్ ప్రజల ప్రతినిధినిగా వారి తరఫున పోరాడుతూ వచ్చారు. దాంతో ఆమె బెంగాల్ ఐకాన్ గా మారిపోయారు.
యాంటీ సెంటిమెంట్ :
ఇక్కడ మరో ముచ్చట కూడా ఉంది. బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన పార్టీకి భిన్నంగా కేంద్రంలో ప్రభుత్వాలు వస్తాయని. అంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి పూర్తిగా యాంటీగా ప్రతిపక్షం కేంద్రంలో వస్తుందని అంటారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బెంగాల్ ఎప్పటికీ చిక్కదు అని కూడా చెబుతారు. అది అర్ధ శతాబ్దంగా రుజువు అవుతూ వచ్చింది. అయితే తొలిసారి కేంద్రంలో బీజేపీ సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అలాగే బెంగాల్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. దాంతో యాంటీ సెంటిమెంట్ ని తిరగరాశారు బెంగాల్ ప్రజలు అని అంటున్నారు.
మరి 2029 మాటేంటి :
అయితే ఇక్కడితో సంబరం అయిపోలేదని అంటున్నారు. బెంగాల్ లో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు 2031 దాకా ఉంటుంది. అయితే లోక్ సభకు 2029 లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి బెంగాల్ లో యాంటీ సెంటిమెంట్ కనుక అదే జోరున అదే తీరున కొనసాగితే కేంద్రంలో ప్రభుత్వం మారుతుందా అన్న కొత్త చర్చ సాగుతోంది. ఇదే ఇపుడు బీజేపీ నేతలను కూడా భయపెడుతోంది. అయితే అలాంటిది ఏదీ లేదని ఈసారి బెంగాల్ లో ఉన్న 42 ఎంపీ సీట్లను కూడా బీజేపీ గెలుచుకుని సంపూర్ణం మెజారిటీతో కేంద్రంలో మిత్రులతో అవసరం లేకుండా నాలుగవ సారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. అయితే బీజేపీ బెంగాల్ లో మొత్తం 42 ఎంపీ సీట్లు గెలుచుకోవాలంటే ఆ విధంగా కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి మరింత గట్టిగా పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.