ఆ ఉద్యోగులు ఓట్లు లెక్కిస్తే తప్పేంటి: మమతకు షాకిచ్చిన సుప్రీం
ఈ విన్నపాన్ని రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు తాజాగా శనివారం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు మమత సర్కారు సూటి ప్రశ్నలు సంధించింది.;
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్(టీఎంసీ) మమతా బెనర్జీకి మరోసారి సుప్రీంకో ర్టులో భారీ ఎదురు దెబ్బతగిలింది. గతంలో సర్ ప్రక్రియపై ఆమె సుప్రీంకోర్టుకు వచ్చి తన వాదనలను స్వయంగా వినిపించారు. 99 లక్షల మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారని ఆమె వాదించారు. అప్పట్లోనూ ఆమెకు సుప్రీంకోర్టు నుంచి స్వాంతన లభించలేదు. ఇక, ఎన్నికలు ముగిసిపోయాయి.
ఫలితమే రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు వ్యవహారంపైనా మమత మరోసారి కోర్టుకెక్కారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించారని.. తద్వారా వారు కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్నది మమత ఆరోపణ. ఈ క్రమంలో తొలుత హైకోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దండిగా ఉన్నారని.. వారిని నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ విన్నపాన్ని రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు తాజాగా శనివారం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు మమత సర్కారు సూటి ప్రశ్నలు సంధించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు లెక్కిస్తే తప్పేంటని నిలదీసింది. అంతేకాదు.. మీరు చెప్పినట్టు కేంద్ర ఎన్నికల సంఘం నడుచుకోవాలని భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. ఎవరి పరిధిలో వారు ఉండడమే మంచిదని.. ఏదైనా తేడా వస్తే.. అప్పుడు కోర్టును ఆశ్రయించడం మంచిదని వ్యాఖ్యానించింది.
ఏదో ఊహించి.. ఏదో జరుగుతుందని అనుకుని కోర్టును ఆశ్రయించి సమయం వృథా చేసుకోవద్దని సీఎంను ఉద్దేశించి కోర్టు తీవ్రంగా స్పందించింది. ఏప్రిల్ 13న ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం..(అంటే.. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగిని రిటర్నింగ్ అధికారిగా నియమించి.. ఆయన కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించేందుకు వీలు కల్పించడం) నడుచుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్న వాదనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మమత దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ముగిస్తున్నామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో మమతకు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరటా లభించకపోవడం గమనార్హం. ఈ నెల 4న(సోమవారం) ఓట్ల లెక్కింపు జరగనుంది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. బీజేపీ వర్సెస్ మమత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరు విన్ అవుతారన్న విషయంపై ఎవరికీ అంతుచిక్కక పోవడం గమనార్హం.