2026లో ప్రపంచానికి అతిపెద్ద ముప్పులివే.. భారత్ కు ఇది ప్రత్యేకం!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో.. ఉన్నంతంలో సౌకర్యంగా ఉంటూ, ప్రశాంతంగా బ్రతికే దేశాలే నిజంగా అభివృద్ధి చెందిన దేశాలు అనే చర్చా తెరపైకి వచ్చింది.;

Update: 2026-01-15 14:30 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో.. ఉన్నంతంలో సౌకర్యంగా ఉంటూ, ప్రశాంతంగా బ్రతికే దేశాలే నిజంగా అభివృద్ధి చెందిన దేశాలు అనే చర్చా తెరపైకి వచ్చింది. ఎందుకంటే.. ఎటు చూసినా ఆర్థిక ఘర్షణలు, సాయుధ ఘర్షణలు, అశాంతి, ఆందోళనలు, యుద్ధ భయాలు.. ఈ సమయంలో.. ప్రపంచానికి అతిపెద్ద ముప్పులపై ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై అమెరికా అధిపత్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... వెనుజువెలకు తానే తాత్కాలిక అధ్యక్షుడినని.. ఆందోళనకారులకు మరణశిక్ష విధించే విషయంలో ఇరాన్ ని.. ‘గ్రీన్ ల్యాండ్ విలీనం - రాష్ట్ర హోదా’ అనే బిల్లుతో ఆ దేశాన్ని తనదైన శైలిలో కెలుకుతున్న ట్రంప్ వ్యవహారం ఓ పక్క... సైబర్ నేరాలు, తప్పుడు సమాచార వ్యాప్తి మరోపక్క ప్రజలకు సరికొత్త సమస్యలుగా మారిన పరిస్థితి.

ఈ పరిణామాల నేపథ్యంలో... 2026కు సంబంధించి 'భౌగోళిక ఆర్థిక ఘర్షణల'ను ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ లో డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల సందర్భంగా తన వార్షిక 'అంతర్జాతీయ నష్ట ప్రమాద నివేదిక'ను విడుదల చేసింది. దీనికోసం ప్రధానంగా... 1,300 మంది ప్రముఖులు, ఆయా రంగాల నిపుణులను సర్వే చేసింది. ఇక భారత్‌ విషయానికొస్తే... వచ్చే రెండేళ్లలో 'సైబర్‌ అభద్రత' అతిపెద్ద ముప్పుగా తెలిపింది.

ఈ సందర్భంగా ప్రధానంగా 2026కు సంబంధించి అంతర్జాతీయంగా టాప్ 5 సమస్యలను ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా... భౌగోళిక ఆర్థిక ఘర్షణలు.. సాయుధ ఘర్షణలు.. విపత్కర వాతావరణ పరిస్థితులు.. సామాజిక విభజన.. తప్పుడు సమాచార వ్యాప్తిలని పేర్కొంది. ఇదే క్రమంలో వచ్చే రెండేళ్లలో భౌగోళిక ఆర్థిక ఘర్షణలను అతిపెద్ద ముప్పుగా తేల్చిన నివేదిక.. దీనికి విపత్కర వాతావరణ పరిస్థితులు కూడా తోడవుతాయని వెల్లడించింది.

ప్రధానంగా భారత్ విషయానికొస్తే... రాబోయే రెండేళ్లలో ప్రధానంగా సైబర్‌ అభద్రత అతిపెద్ద సమస్య కాబోతుందని నివేదిక తెలిపింది. దీనికితోడు.. ఆదాయ అసమానతలు, ఆర్థిక క్షీణత, సామాజిక భద్రత - ప్రజాసేవలు సరిపడా అందుబాటులో లేకపోవడం వంటివి తీవ్ర ముప్పులుగా వెల్లడించింది.

భారత్ యూపీఐ కి ప్రశంసలు!:

అదే సమయంలో.. ప్రభుత్వాలు తమ బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, భవిష్యత్తులో ప్రపంచ రుణం లేదా విస్తృత ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడానికి మరింత స్థితిస్థాపకంగా ఉండేలా చర్యలు తీసుకోవడానికి భారతదేశ ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) ను మంచి ఉదాహరణగా డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారం నుండి ఉత్పన్నమయ్యే నష్టాల గురించి, ఫేక్ వీడియోలు, చిత్రాలు, ఆడియో రికార్డింగ్‌ ల విస్తరణ ఒక ప్రత్యేక సమస్యాత్మక ప్రాంతం అని పేర్కొంది.

Tags:    

Similar News