ఉపరాష్ట్రపతి వ్యాఖ్యతో నేతాజీ మరణం మళ్లీ హాట్ టాపిక్
స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించి.. మిగిలిన వారికి భిన్నంగా తరచూ వార్తల్లోకి వస్తుంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్.;
స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించి.. మిగిలిన వారికి భిన్నంగా తరచూ వార్తల్లోకి వస్తుంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశ స్వాతంత్ర్యం కోసం మిగిలిన పోరాటయోధులకు భిన్నంగా ఆయన వ్యవహరించిన వైఖరి నేటి తరాన్ని కూడా విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే..ఆయన మరణం మీద ఉన్న మిస్టరీపై ఏదో ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది.ఆయన మరణం ఎలా చోటు చేసుకుందన్న దానిపై వాదనలు ఎలా ఉన్నా.. అధికారికంగా మాత్రం విమాన ప్రమాదంలోనే మరణించినట్లుగా చెప్పటం తెలిసిందే.
అయితే.. ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదని..ఆయన మరణించినట్లుగా ప్రచారం జరిగిన తర్వాత కూడా నేతాజీని కలిశామని.. ఆయన్ను చూశామని చెప్పే వారికి కొదవ లేదు. ఇలాంటి వాదనలు ఎలా ఉన్నా.. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రముఖుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై చేసిన తాజా వ్యాఖ్యలు ఆయన మరణంలో ఉన్న మిస్టరీ గురించి మరోసారి మాట్లాడుకునేలా చేశాయని చెప్పాలి.
తాజాగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాక్రిష్ణణ్ తమిళనాడులోని రామనాథపురం జిల్లా పసుంపోన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు సుభాస్ చంద్రబోస్ కు బలమైన మద్దతుదారుగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తు రామలింగ దేవర్ కు నివాళులు అర్పించే ప్రోగ్రాంలో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని.. ఆయన్ను తాను కలిసినట్లుగా ముత్తురామలింగ దేవర చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు.
ముత్తురామలింగ దేవర్ చెప్పిన మాటల్ని తాను నమ్ముతున్నట్లుగా చెప్పిన ఉపరాష్ట్రపతి.. ‘‘దేవర్ మాటల్ని నమ్ముతున్నా. ఆయన తన జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. రాజకీయాల్లో ఉన్న దేవర్.. తన ప్యాణంలో ఆధ్యాత్మికత మీద ఫోకస్ చేశారు’’ అని చెప్పారు. మొత్తంగా దేవర్ చెప్పిన మాటల్ని ప్రస్తావిస్తూ.. ఆయన చెప్పినట్లే బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదన్న మాటతో ఆయన మరణ మిస్టరీ మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.