కేసీఆర్ నవీన్ పట్నాయక్ ఆ వైపు...జగన్ ఓటు ఈ వైపు !
జాతీయ రాజకీయాల్లో మూడు ప్రాంతీయ పార్టీలు తటస్థ వాదాన్ని అనుసరిస్తున్నాయి. అవి ఏపీ నుంచి వైసీపీ తెలంగాణా నుంచి బీఆర్ఎస్ ఒడిశా నుంచి బిజూ జనతాదళ్.;
జాతీయ రాజకీయాల్లో మూడు ప్రాంతీయ పార్టీలు తటస్థ వాదాన్ని అనుసరిస్తున్నాయి. అవి ఏపీ నుంచి వైసీపీ తెలంగాణా నుంచి బీఆర్ఎస్ ఒడిశా నుంచి బిజూ జనతాదళ్. ఈ మూడు పార్టీలు అటు అధికార ఎన్డీయే కూటమిలో కానీ ఇటు విపక్ష ఇండియా కూటమిలో కానీ లేవు. తన తటస్థ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. మరి ఈ మూడు పార్టీల స్టాండ్ ఏమిటి అన్న చర్చ జాతీయ స్థాయిలో జరిగింది. అయితే వైసీపీ అందరి కంటే ముందే తన విధానం బయటపెట్టింది. ఎన్డీయే అభ్యర్ధికే తమ మద్దతు అని ఆ పార్టీ గట్టిగానే చాటి చెప్పింది.
కేసీఆర్ సమయోచిత నిర్ణయం :
ఇక తెలంగాణాలో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని తాజాగా వెల్లడించింది. తాము ఏ కూటమిలో లేమని తాము ఎవరికీ జత చేరి లేమని తెలంగాణా ప్రజల తోనే తాము ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ ఓటు చేయమని స్పష్టంగా చెప్పారు. దీంతో న్యూట్రల్ స్టాండ్ ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది అని అంటున్నారు.
అనూహ్యంగా బీజేడీ సైతం :
ఇక బీఆర్ఎస్ బాటలోనే మరో పార్టీ బీజేడీ కూడా ఈ తరహా నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కి తాము దూరంగా ఉండాలని బీజేడీ లేటెస్ట్ గా డెసిషన్ తీసుకుంది. ఎన్డీయే ఇండియా కూటమికి సమ దూరం తమ విధానం అని ఆ పార్టీ ప్రకటించింది. అందుకే తాము పోలింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించామని పేర్కోంది. ఇక లోక్ సభలో ఎంపీలు లేని బీజేడీకి రాజ్యసభలో మాత్రం తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. దాంతో ఈ నంబర్ చాలా కీలకమైనదే. ఇపుడు వీరంతా ఓటింగ్ కి దూరంగానే ఉండబోతున్నారు అన్న మాట.
రాజకీయంగా చర్చనీయాంశం :
ఒక వైపు బీఆర్ఎస్ కూడా ఓటింగ్ కి దూరం అని ప్రకటించింది. ఆ పార్టీకి రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. బీజేడీకి తొమ్మిది మందితో కలుపుకుంటే 13 మంది ఎంపీలు దూరంగా ఉంటారు అన్న మాట. జాతీయ స్థాయిలో చూసుకుంటే ఎన్డీయే ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న వేళ ఈ 13 మంది ఎంపీల నంబర్ దూరంగా ఉండడం రాజకీయ సమీకరణలు మీద ఎంతో కొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇదే ఇపుడు జాతీయ స్థాయిలో చర్చకు తావిస్తోంది.
వైసీపీ స్టాండ్ ఓకేనా :
న్యూట్రల్ గా ఉన్న పార్టీల ఓట్లు దేశంలో దాదాపుగా అరవై నుంచి డెబ్బై దాకా ఉన్నాయి. అయితే ఇందులో వైసీపీ 11 ఎంపీల ఓట్లు వేరు పడినట్లు అయింది. న్యూట్రల్ స్టాండ్ మాది అని అటు బీజేడీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ చాలా గట్టిగానే చెప్పగలిగాయి. కానీ వైసీపీ మాత్రం ఎన్డీయే పక్షం చేరడం రాజకీయంగా కరెక్టేనా అన్న చర్చ కూడా వస్తోంది. అయితే బీఆర్ఎస్ కానీ బీజేడీ కానీ ఆయా రాష్ట్రాలలో తమకు రాజకీయంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాయని అంటున్నారు. ఏపీ వరకూ వైసీపీ తన వ్యూహాల మేరకే నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఇది ఆ పార్టీ తీసుకున్న సరైన నిర్ణయమే అన్నది ఆ పార్టీ రాజకీయ అవసరాలు భవిష్యత్తు గురించి ఆలోచించి విశ్లేషించి అంటున్న మాటగా ఉంది.