వైసీపీ మేయర్ ని దించేసే వేళ బిగ్ ట్విస్ట్ !
విశాఖలో వైసీపీ మేయర్ ని దించేయాలని టీడీపీ కూటమి పట్టుదల మీద ఉన్న సంగతి తెలిసిందే.;
విశాఖలో వైసీపీ మేయర్ ని దించేయాలని టీడీపీ కూటమి పట్టుదల మీద ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగిన ఏర్పాట్లు చాలా కాలం క్రితమే పూర్తి చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా కార్పోరేటర్ల బలాన్ని సంపాదించుకుందని అంటున్నారు. గత నెల మేయర్ మీద అవిశ్వాసం నోటీసు కూడా ఇచ్చేసింది.
ఈ నెల 19న జీవీఎంసీలో అవిశ్వాసం మీద చర్చ సాగనుంది. మేయర్ ని దించాలంటే మొత్తం జీవీఎంసీలో ఉన్న సంఖ్యాబలంలో మూడింట రెండు వంతులు ఉండాలి. ఆ ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా పడాల్సి ఉంది. అలా లెక్క చూస్తే 78 దాకా ఓట్లు పడాల్సి ఉంది. కూటమి పార్టీలు అన్నీ సఖ్యతగా ఉంటేనే ఈ టాస్క్ ని ఫినిష్ చేయగలుగుతారు.
అయితే టీడీపీ కూటమిలో డిప్యూటీ మేయర్ విషయంలో పేచీలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పోస్టుని జనసేన కోరుతోంది. మేయర్ గా టీడీపీకి చెందిన ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఉంటారు. అందువల్ల డిప్యూటీ తమకు ఇవ్వాలని కోరుతోంది
దీని మీద ఏ మాట అనుకోకుండా ఫైనలైజ్ కాకుండా ముందుకు పోవడానికి వీల్లేదు అన్నది జనసేన నేతల ఆలోచనగా ఉంది అని అంటున్నారు. జనసేనకు 11 మంది కార్పోరేటర్లు ఉన్నారు. వారంతా అవిశ్వాస తీర్మానానికి చాలా కీలకంగా మారనున్నారు
ఇక విశాఖలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వేడి గట్టిగా రాజుకుంది. దేశాలను దాటి మరీ క్యాంప్ రాజకీయాలను పోటాపోటీగా ఏర్పాటు చేశారు. వైసీపీ అయితే శ్రీలంకలో తమ పార్టీకి చెందిన కార్పోరేటర్లతో క్యాంప్ ని పెట్టింది. టీడీపీ చలో మలేషియా అని అంటోంది.
అయితే అసలైన చిక్కు వచ్చిపడింది. టీడీపీ మలేసియా ట్రిప్ ని జనసేన నుంచి సగానికి సగం మంది కార్పోరేటర్లు తాము వెళ్ళేది లేదని చెబుతున్నారు. తాము క్యాంప్ కి రామని చెప్పేస్తున్నారు దానికి కారణం వారు డిప్యూటీ మేయర్ పదవి మీద మోజు పెంచుకున్నారు. ఆ పంచాయతీని ముందు తేల్చిన మీదటనే క్యాంప్ పాలిటిక్స్ అని అంటున్నారు.
దీంతో మేయర్ పీఠం కొట్టాలని గట్టిగా గురి పెట్టిన కూటమికి డిప్యూటీ దగ్గరే పీటముడి పడుతోంది అని అంటునారు. వైసీపీ అయితే కూటమికి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సరిపడా బలం లేదని చెబుతోంది. మరో వైపు చూస్తే వామపక్షాలకు చెందిన కార్పోరేటర్లు అవిశ్వాసానికి ఓటు చేసేది లేదని చెబుతున్నారు.
దీంతో వైసీపీ మేయర్ మీద అవిశ్వాసానికి గడువు దగ్గర పడుతున్న వేళ కూటమిలో సర్దుబాట్లూ దిద్దుబాట్లు ఇంకా చాలా ఉన్నాయని వాటిని సెట్ చేసుకోవాల్సి ఉందని అంటున్నారు. జనసేన ఈ విషయంలో డిప్యూటీ మేయర్ పంచాయతీ ఉంది. అది తేల్చకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
ఇక చూస్తే ఏడాది మాత్రమే ఉన్న ఈ పదవి కోసం ఇంత హంగామా అవసరమా అన్న చర్చ కూడా కూటమి పెద్దలలో ఉంది. ఏది ఏమైనా ఈ నెల 19న మాత్రం విశాఖ రాజకీయాలో బిగ్ పొలిటికల్ డే గా ఉంది అని అంటున్నారు. వైసీపీ తన మేయర్ సీటుని నిలబెట్టుకుంటుందా లేక టీడీపీ కూటమి గెలిచి సత్తా చాటుతుందా అన్నది అతి పెద్ద ఉత్కంఠగా ఉంది. విశాఖ రాజకీయాలను మలుపు తిప్పేదిగా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.