జిల్లా ఫస్ట్: సాగర తీరంపై చంద్రబాబు సంతకం.. !
ఇటీవల గూగుల్ డేటా కేంద్రం రావడం ద్వారా.. దానికి అనుబంధంగా మరిన్ని సంస్థలు వస్తున్నాయి. రిలయెన్స్ డేటా హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.;
రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉండగా.. ఉమ్మడి జిల్లాలు 13 ఉన్నాయి. అటు ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకున్నా.. ఇటు విభజిత జిల్లాల పరంగా చూసుకున్నా.. కొన్ని జిల్లాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఉదాహరణకు తిరుపతిలో శ్రీసిటీ ఏర్పాటయ్యాక.. పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. అదేవిధంగా అనంతపురంలో కియా ఏర్పాటు చేశాక.. అక్కడ కొంత మేరకు అబివృద్ధి జరుగుతోంది. ఇక, రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత.. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో మార్పు కనిపిస్తోంది. భూముల ధరలకు కూడా రెక్కలు పెరుగుతున్నాయి.
వీటికంటే కూడా.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మార్మోగుతున్న పేరు విశాఖ. విభజన తర్వాత.. విశాఖ ఉమ్మడి జిల్లా అనకాపల్లి లో కొంత భాగం పోయింది. అయినప్పటికీ..ఉమ్మడిగా విశాఖ జిల్లా ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా మారిందన్నది వాస్తవం. ఆది నుంచి కూడా ఐటీ రాజధానిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నించారు. దీంతో పరిశ్రమలు క్యూకట్టాయి. ఇక, ఆ తర్వాత సినీ పరిశ్రమ ఏర్పాటుకూడా అడుగులు పడ్డాయి. అదేవిధంగా 2024లో కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. విశాఖపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టడంతో పాటు పరిశ్రమల స్థాపనకు, ముఖ్యంగా ఐటీరంగానికి ప్రాధాన్యం పెంచారు.
ఇటీవల గూగుల్ డేటా కేంద్రం రావడం ద్వారా.. దానికి అనుబంధంగా మరిన్ని సంస్థలు వస్తున్నాయి. రిలయెన్స్ డేటా హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఇన్ఫోసిస్, టాటా వీరి టీసీఎల్.. వంటి విశాఖ నగరానికి మరింత వన్నె తెస్తున్నాయి. అదేస మయంలో ఐటీ రంగానికి ఊతం ఇస్తున్నారు. దీంతో ఇతర దేశాలకు చెందిన పలు సంస్థలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నా యి. వీటితోపాటులూలూ మాల్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఇలా.. విశాఖ పట్నంపై సీఎం చంద్రబాబు చెరగని సంతకం చేసినట్టు అయింది. ఇక, ప్రస్తుతం విశాఖలో రియల్ ఎస్టేట్‌రంగం కూడా మరింత పుంజుకుంది.
దీనికి కూడా ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్న భూములకు ధరల రెక్కలు మొలిచాయి. ఉపాధి, ఉద్యోగాలకు తోడుగా.. పర్యాటకంగా కూడా నగరాన్ని అభివృద్ది చేస్తున్నారు. ఇవన్నీవిశాఖకు మరింతగా వన్నె తెస్తున్నాయి. ఇక, వైసీపీ హయాంలో నిర్మించిన రుషి కొండ ప్యాలెస్‌పై ప్రస్తుతం దృష్టి పెట్టారు. దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని.. లేదా ప్రఖ్యాత హోటల్‌గా రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. నగరంలో అతి పెద్ద పర్యాటక హబ్‌గా మారుతుందన్న అంచనాలు వున్నాయి ఇతర జిల్లాలతో పోల్చినప్పుడు విశాఖ ఇప్పుడు తారస్థాయిలో ఉందని.. రాబోయే రోజుల్లో ఇతర జిల్లాలకు మించిన నగరంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు పరిశీలకులు.