చాట్ జీపీటీతో కోటీశ్వరురాలు అయ్యింది.. 1.3 కోట్లు గెలిచింది..

నిత్య జీవితంలో కృత్రిమ మేధస్సు (AI) పాత్ర పెరుగుతున్న కొద్దీ, అది సృష్టిస్తున్న అనూహ్య సంఘటనలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి.;

Update: 2025-09-25 15:30 GMT

నిత్య జీవితంలో కృత్రిమ మేధస్సు (AI) పాత్ర పెరుగుతున్న కొద్దీ, అది సృష్టిస్తున్న అనూహ్య సంఘటనలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. తాజాగా, అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన క్యారీ ఎడ్వర్డ్స్ అనే మహిళకు టెక్నాలజీ రూపంలో అదృష్టం వరించింది. కేవలం చాట్‌జీపీటీ సూచించిన సంఖ్యలతో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఆమె, ఏకంగా $1,50,000 (సుమారు రూ.1.3 కోట్లు) బహుమతిని గెలుచుకున్నారు. అయితే, ఈ అదృష్టాన్ని తన అవసరాలకు వాడుకోకుండా, ఈ మొత్తం బహుమతిని మూడు దాతృత్వ సంస్థలకు విరాళంగా ఇచ్చి ఆమె గొప్ప మనసు చాటుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు 'సాంకేతికతతో మానవీయత'కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

అసలు కథేంటి?

సాధారణంగా లాటరీ టికెట్లు కొనని ఎడ్వర్డ్స్, సెప్టెంబర్ 8న జరిగిన పవర్‌బాల్ డ్రాలో పాల్గొనాలని అనుకున్నారు. లాటరీ సంఖ్యలను ఎంచుకునే విషయంలో సందిగ్ధంలో పడిన ఆమెకు, ఓ ఆలోచన తట్టింది. వెంటనే ఆమె తన మొబైల్‌లో చాట్‌జీపీటీ యాప్‌ను తెరిచి, "లాటరీ సంఖ్యలను సూచించగలవా?" అని అడిగారు. చాట్‌జీపీటీ ఇది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని, ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేయడం అసాధ్యమని హెచ్చరించింది. అయినప్పటికీ, నాలుగు సంఖ్యల కలయికను సూచించింది. ఎడ్వర్డ్స్ చాట్‌జీపీటీ ఇచ్చిన ఆ సంఖ్యలతోనే లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. రెండు రోజుల తర్వాత డ్రా ఫలితాలు చూసుకున్న ఆమె షాక్‌కు గురయ్యారు! ఆమె టికెట్‌లోని నాలుగు సంఖ్యలు, అలాగే పవర్‌బాల్ సంఖ్య డ్రా అయిన సంఖ్యలతో సరిపోయాయి.

* పవర్‌ప్లే బోనస్‌తో భారీ విజయం

సాధారణంగా మొదటి ఐదు సంఖ్యల్లో నాలుగు, పవర్‌బాల్ సంఖ్య సరిపోలితే విజేతకు $50,000 బహుమతి లభిస్తుంది. అయితే ఎడ్వర్డ్స్ టికెట్‌లో 'పవర్‌ప్లే' బోనస్ ఉండటం వలన, ఆమె గెలిచిన మొత్తం మూడింతలు పెరిగి $1,50,000 (సుమారు రూ.1.32 కోట్లు)కి చేరింది. కృత్రిమ మేధస్సు సూచనతో అనూహ్య విజయాన్ని అందుకున్నారు.

*మనసున్న మనిషి.. మొత్తం విరాళం

ఇంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకున్నా, ఎడ్వర్డ్స్ ఒక్క పైసా కూడా తన కోసం ఉంచుకోలేదు. ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా, ఈ మొత్తాన్ని మూడు దాతృత్వ సంస్థలకు సమానంగా విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు.

విరాళం అందుకున్న సంస్థలు

అసోసియేషన్‌ ఫర్‌ ఫ్రంటోటెంపోరల్‌ డిజెనరేషన్‌ (AFTD): ఆమె భర్త గతంలో అరుదైన మతిమరుపు వ్యాధి (డిమెన్షియా)తో మరణించడంతో, ఆ వ్యాధి పరిశోధన, బాధితుల సహాయం కోసం ఈ సంస్థకు విరాళం అందించారు.

షాలోమ్‌ ఫార్మ్స్‌, రిచ్‌మండ్‌: పేదరికం నివారణ, ఆహార లోపం తీర్చడం కోసం పనిచేసే ఈ సంస్థకు సహాయం చేశారు.

నావీ–మెరైన్‌ కార్ప్స్‌ రిలీఫ్‌ సొసైటీ: ఆమె తండ్రి గతంలో యుద్ధ విమాన పైలట్‌గా సేవలు అందించడంతో సైనిక కుటుంబాలకు ఆర్థిక, విద్యా సహాయం అందించే ఈ సంస్థకు విరాళం ఇచ్చారు.

“నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. ఈ డబ్బు నిజంగా అవసరమైన చోటికి చేరడమే నాకు అంతులేని సంతోషాన్ని ఇచ్చింది” అని క్యారీ ఎడ్వర్డ్స్ తన నిర్ణయాన్ని గురించి తెలిపారు. లాటరీ అధికారులు సైతం, గెలిచిన పూర్తి మొత్తాన్ని దానం చేయడం చాలా అరుదైన, గొప్ప నిర్ణయం అని ఆమెను ప్రశంసించారు.

Tags:    

Similar News