రీల్స్ పిచ్చితో మృత్యువు ఒడిలోకి.. ఈ విచిత్ర ధోరణి మారేదెన్నడు?

ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధితో పాటు మనిషి ఆలోచన ధోరణి కూడా పూర్తిగా మారిపోతోంది.;

Update: 2026-02-13 06:06 GMT

ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధితో పాటు మనిషి ఆలోచన ధోరణి కూడా పూర్తిగా మారిపోతోంది. జీవితంలో ఉన్నత విలువలు నేర్చుకోవాల్సిన యువత..బంగారు భవిష్యత్తు కోసం పాటుపడకుండా పాపులారిటీని సంపాదించుకోవడానికి రీల్స్ మోజులో పడి మృత్యువాత పడుతున్నారు.. తల్లిదండ్రులు తమ పిల్లలు తమనేదో ఉద్దరిస్తారు అనుకుంటే.. ఈ పిల్లలు మాత్రం ఇలా రీల్స్ మోజులో భిన్నమైన పనులు చేస్తూ స్వర్గస్తులవుతూ వారికి తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారని చెప్పాలి.

ఇకపోతే ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఊహించని విన్యాసాలు చేస్తూ సమాజానికి సిగ్గుచేటుగా మారుతున్నారు. మరి ఈ విచిత్ర ధోరణి మారేదెన్నడు? పబ్లిసిటీ అనే ఒక్క పేరుతో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. వివిధ సోషల్ మీడియా యాప్ లను ఉపయోగిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాజంలో గుర్తింపు రావాలి అంటే నలుగురికి సహాయపడే పనులు చేయాలి లేదా తమకంటూ ఒక ఉన్నతమైన హోదాను కల్పించుకోవాలి. విద్యలో మందంజులో ఉండడం లేదా సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఆవిష్కరణకు పాటుపడడం లాంటివి చేస్తే ఖచ్చితంగా మీరు ఎలాంటి పనులు చేయకుండానే మీ ప్రతిభ మీకు ఊహించని గుర్తింపును అందిస్తుంది.

అంతేకాదు ఆ గుర్తింపు అనేది మనం చేసే పనులను బట్టి ఉంటుంది.. సొంత తెలివితేటలను ఉపయోగించకుండా అడ్డదారిలో వెళ్తూ ఇలా చేయరాని పనులు చేసి ప్రజలలో క్రేజ్ దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ.. ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరేమో వేగంగా వెళ్లే ట్రైన్ నుంచి దూకి స్టంట్ చేస్తారు. ఇంకొకరేమో నేరుగా లోతైన బావుల్లోకి దిగుతూ తామేదో గొప్పగా విన్యాసం చేస్తున్నామని చూపిస్తూ అందరి చేత ఔరా అనిపించు కోవడానికి అతి కష్టమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇంకొంద మంది ఏకంగా ప్రాణాలనే హరింపచేసే ఆహారాలను తింటూ ప్రాణాలు కోల్పోతున్నారు.

అందులో భాగంగానే ఇటీవల ఫిలిప్పీన్స్ లో ఒక మహిళ ఫుడ్ ఇన్ఫ్లు యెన్సర్ 'డెవిల్ క్రాబ్' అనే పీత తిని మృత్యువాత పడ్డారు. 51 సంవత్సరాల ఎమ్మా అనే మహిళ తన స్నేహితులతో కలిసి పలావన్ ప్రావిన్స్ లోని ప్వేటో ప్రిన్సెసాలో ఉన్న మడ అడవులకు వెళ్లారు. అక్కడ కొబ్బరి పాలు వేసిన గుల్ల చేపలు వండిన తీరును, వాటిని ఆస్వాదిస్తూ తినడాన్ని ఎమ్మా తన టిక్ టాక్ ఫాలోవర్ల కోసం చిత్రీకరించారు. ఆ మరుసటి రోజు ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్పృహ కోల్పోయి , ఆమె పెదవులు ముదురు నీలం రంగులోకి మారాయి. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆమె ఫిబ్రవరి 6న మృతి చెందింది. డెవిల్ క్రాబ్ అనే పీతను ఆమె తిన్నట్టుగా వైద్యులు తెలిపారు. వీటిలోని విష పదార్థాలు వంట ప్రక్రియలో కూడా నాశనం కావట. పైగా తిన్న కొన్ని గంటల్లోనే పక్షవాతం లేదా మరణానికి కారణమవుతాయని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా గత ఆరు రోజుల క్రితం యూపీలో ఉరికి సంబంధించిన రీల్ తీయడానికి ప్రయత్నించిన యువతి పొరపాటు జరిగి ప్రమాదవశాత్తు నిజంగానే ఉరికి బలయింది. బన్దా జిల్లాలోని మోహిని అనే 27 ఏళ్ల యువతి ఉరికి సంబంధించిన రీల్ తీద్దామని ప్రయత్నించింది. దానికనుగుణంగా ఫ్యానుకు తాడు కట్టి , తన మెడ చుట్టూ ఉచ్చు బిగించుకుంది. ఈ చిత్రాలను ఆమె మొబైల్లో చిత్రీకరించింది కూడా.. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె కొద్దిసేపటి తర్వాత ప్రాణాలు కోల్పోయింది. తన నాలుగేళ్ల పాప తలుపు తీసేసరికి ఆమె విగత జీవిగా పడి ఉంది. తన తల్లికి ఏం జరిగిందో తెలియక ఆ చిన్నారి పెద్దగా ఏడ్చేసరికి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా.. ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో రీల్స్ తీసే తొందరలో పొరపాటున స్టూలు జారీ ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు.

ఇక ఈ రెండు ఘటనలు మరువకముందే మరో ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కడపకు చెందిన ముబారక్ వస్త్ర దుకాణంలో పనిచేసేవాడు. అతడు గత వారం రోజుల క్రితం తన స్నేహితుడితో ద్విచక్ర వాహనంపై రీల్స్ చేస్తూ దాదాపు మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళాడు. ఇక వాహనం అదుపు తప్పడంతో ఇద్దరు కిందపడ్డారు. ముబారక్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యారు. రీల్స్ మోజులో పడి ఇలా బైకులపై స్టంట్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు

ఇలా ఈ రీల్స్ మోజులో ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. అటు ప్రభుత్వాలు ఇటు అధికారులు ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇలాంటి కొన్ని యాప్స్ కారణంగా యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. యువత అంటే కొంతవరకు తెలియని వైనం అని అనుకోవచ్చు.. కానీ వయసు మీద పడిన వారు కూడా ఇలా రీల్స్ పిచ్చిలో చేయరాని పనులు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి ఆలోచనలను పక్కనపెట్టి సవ్య దిశలో అడుగులు వేస్తూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం..

Tags:    

Similar News