థార్ కార్ల‌తో దాడుల నిందితుల‌కు నో బెయిల్

బెజ‌వాడ‌లో రెండు థార్ కార్ల‌తో న‌డిరోడ్డుపై బీభ‌త్సాన్ని క్రియేట్ చేసిన ఇద్ద‌రు యువ‌కుల (బొల్లా ఓంకార్, లింగ‌మ‌నేని రోహిత్)కు విజ‌య‌వాడ కోర్టు ప‌ద్నాలుగు రోజుల జ్యుడీషియ‌ల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Update: 2026-05-24 15:06 GMT

బెజ‌వాడ‌లో రెండు థార్ కార్ల‌తో న‌డిరోడ్డుపై బీభ‌త్సాన్ని క్రియేట్ చేసిన ఇద్ద‌రు యువ‌కుల (బొల్లా ఓంకార్, లింగ‌మ‌నేని రోహిత్)కు విజ‌య‌వాడ కోర్టు ప‌ద్నాలుగు రోజుల జ్యుడీషియ‌ల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ కోసం విజ‌య‌వాడ‌కు చెందిన సీనియ‌ర్ లాయ‌ర్ల టీం రంగంలోకి దిగిన‌ప్ప‌టికి న్యాయాధికారి బెయిల్ ఇవ్వ‌టానికి స‌సేమిరా అన్నారు. వాళ్లేం చేశారో యావ‌త్ ప్ర‌పంచం చూసింద‌ని.. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులేన‌ని.. వారి అరాచ‌కాల్ని కోర్టు స‌మ‌ర్థించ‌ద‌ని.. త‌ప్పుడు సంకేతాలు వెళ్లేలా వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని.. బెయిల్ ఇవ్వ‌టం సాధ్యం కాదంటూ స్ప‌ష్టం చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎలాంటి గాయం కాలేద‌ని.. కానీ పోలీసులు హ‌త్యాయ‌త్నం సెక్షన్లు న‌మోదు చేయ‌టంపైనా డిఫెన్స్ లాయ‌ర్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌గా.. న్యాయాధికారి పోలీసుల తీరును స‌మ‌ర్థించారు. అదే స‌మ‌యంలో లాయ‌ర్ల వాద‌న‌ల‌ను త‌ప్పు ప‌ట్టారు. బెయిల్ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా క‌ఠిన వ్యాఖ్య‌లు చేశారు. వీరిద్ద‌రి ప్ర‌వ‌ర్త‌న‌పై తీవ్ర అసంతృప్తి చేశారు. కోర్టులో ఏర్పాటు చేసిన స్క్రీన్ల‌పై వీరు చేసిన ప‌నికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను చూసిన ఆయ‌న తీవ్రంగా స్పందించారు.

సినిమా ఫ‌క్కీలో కార్ల‌తో ఢీ కొట్టుకోవ‌టం.. న‌డిరోడ్డుపైన వాహ‌న‌దారుల‌ను భ‌య‌భ్రాంతుల‌ను చేయ‌టం.. రాడ్లు.. హాకీ స్టిక్ ల‌తో దాడుల‌కు పాల్ప‌డ‌టాన్ని చూసిన న్యాయాధికారి.. బాధ్య‌తాయుతంగా న‌డుచుకోవాల్సిన స‌మ‌యంలో న‌డిరోడ్డుపై ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేదని ప్ర‌శ్నించ‌టంతో పాటు.. మీ చ‌దువులు ఏమ‌య్యాయి? సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు రోడ్ల మీద ఉన్న వాహ‌న‌దారులు తిరిగే ప్రాంతంలో ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స్టంట్లు చేయ‌టం స‌మాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్న‌ట్లు? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ సంద‌ర్భంగా డిఫెన్స్ లాయ‌ర్ త‌న వాద‌నను వినిపిస్తూ.. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేద‌ని.. పోలీసులు కావాల‌నే వారిపై హ‌త్యాయ‌త్నం సెక్ష‌న్ చేర్చార‌ని.. ఈ కేసుకు ఆ సెక్ష‌న్ వ‌ర్తించ‌ద‌న్నారు. సాక్ష్యుల‌ను పోలీసులు ప్ర‌భావితం చేసిన‌ట్లుగా ఆరోపించారు.

బెయిల్ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా ఒక‌రి కార్ల‌ను మ‌రొక‌రు బ‌లంగా ఢీ కొన్న ఉదంతానికి సంబంధించిన దృశ్యాలకు సంబంధించి ఒక పెన్ డ్రైవ్ ను పోలీసులు కోర్టుకు స‌మ‌ర్పించారు. విజ‌య‌వాడ నాలుగో అద‌నపు (ఎసీజేఎం) మెజిస్ట్రేట్ కోర్టు హాల్ లోని టీవీ స్క్రీన్ పై వీడియో ఫుటేజ్ ను వీక్షించారు. స‌ద‌రు దృశ్యాలను చూసిన తర్వాత ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురయ్యారు. నిందితుల వైపు చూస్తూ క‌ఠిన ప‌ద‌జాలంతో మంద‌లించారు. మీరేం చేశారో మీకు అర్థ‌మ‌వుతుందా? విజ‌య‌వాడ న‌డిరోడ్డుపై మీ ఇద్ద‌రి చ‌ర్య‌ల‌ను.. మీరు చేసిన ఘోరాన్ని యావ‌త్ ప్ర‌పంచం చూసిందన్నారు. మీరు చ‌దివిన చ‌దువులు ఏమ‌య్యాయి? బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా ఉండాల్సిన వ‌య‌సులో ఇలాంటి ప‌నులు చేస్తారా? ఇలాంటి అరాచ‌కాల‌ను.. స‌మాజానికి హాని క‌లిగించే క్రిమిన‌ల్ ప్ర‌వ‌ర్త‌న‌ను కోర్టు ఎంత‌మాత్రం స‌మ‌ర్థించ‌ద‌న్న ఆయ‌న‌.. వారికి ప‌ద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

బెయిల్ పిటిష‌న్ మీద విచార‌ణ జ‌రిపిన స‌మ‌యంలో డిఫెన్స్ లాయ‌ర్లు త‌మ వాద‌న‌లు వినిపిస్తూ.. యువ‌కులు ఇద్ద‌రు విద్యార్థుల‌ని.. చిన్న విష‌యంలో త‌లెత్తిన క్షణిక‌మైన ఆవేశం.. ప‌ర‌స్ప‌రం రెచ్చ‌గొట్టుకోవ‌టం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లుగా పేర్కొన్నారు. నిందితుల్లో ఎవ‌రికి ఒక‌రినొక‌రిని చంపుకోవాల‌న్న ఉద్దేశం లేద‌ని.. కేవ‌లం వాహ‌నాల అద్దాలు మాత్ర‌మే ప‌గిలాయ‌ని.. అందుకే వారిపై పెట్టిన హ‌త్యాయ‌త్నం సెక్ష‌న్ వ‌ర్తించ‌ద‌న్నారు. దీనికి స్పందించిన న్యాయాధికారి ఘ‌ట‌న జ‌రిగింది వాస్త‌వ‌మే క‌దా? న‌డిరోడ్డుపై క‌ల్లోలాన్ని క్రియేట్ చేసి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది నిజ‌మే క‌దా? నిందితుల చ‌ర్య స‌మాజ భ‌ద్ర‌త‌కు ముప్పుగా ప‌రిణ‌మించింద‌న్న ఆయ‌న‌.. లాయ‌ర్ల వాద‌న‌ను తోసిపుచ్చారు. ఈ సంద‌ర్భంగా న్యాయాధికారి వ్యాఖ్య‌ల వేళ నిందితులు ఇద్ద‌రు మౌనంగా ఉండిపోయారు.

విజ‌య‌వాడ న‌డిరోడ్డు మీద‌ నిందితులు చేసిన హంగామా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన తీరును పరిశీలించిన అనంతరం, న్యాయాధికారి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఎ1 నిందితుడు బొల్లా ఓం, ఎ2 నిందితుడు రోహిత్ లింగమనేనిలను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వేళ‌.. నిందితుల త‌ర‌పు కుటుంబ స‌భ్యులు కోర్టుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వారిని మీడియా మాట్లాడించే వేళ‌.. వారు స్పందించేందుకు నిరాక‌రించారు. త‌మ ముఖాల‌కు చేతులు అడ్డుగా పెట్టుకొని అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News