పార్టీ పెడతా...జగన్ కి విజయసాయిరెడ్డి షాక్
విజయసాయిరెడ్డిని ఇపుడు మాజీ ఎంపీ మాత్రమే కాదు మాజీ వైసీపీ నేతగా కూడా కాదు, మాజీ రాజకీయ నేతగా ప్రస్తావించాలేమో.;
విజయసాయిరెడ్డిని ఇపుడు మాజీ ఎంపీ మాత్రమే కాదు మాజీ వైసీపీ నేతగా కూడా కాదు, మాజీ రాజకీయ నేతగా ప్రస్తావించాలేమో. ఆయన తానుగానే చెప్పుకున్నట్లుగా ప్రస్తుతం ఒక రైతు మాత్రమే. ఆయన అలా అన్నా విజయసాయిరెడ్డి రాజకీయం ఆయన డైనమిక్ నేచర్ చూసిన వారు ఆయన ఏమి మాట్లాడినా పొలిటికల్ యాంగిల్ చూస్తారు, హైలెట్ కూడా చేస్తారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనకు విజయసాయిరెడ్డి వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో రెడ్డిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మీద ఆయన కోటరీ మీద విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు జగన్ కే ఒక సవాల్ అన్నట్లుగా అవసరం అయితే తాను పార్టీని పెడతాను అని కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు.
జగన్ ఇది వినాలి :
వైఎస్ జగన్ చుట్టూ నిబద్ధత లేని వారే ఉన్నారని వారంతా ఒక కోటరీగా ఏర్పడ్డారని వారి మాటలనే జగన్ వింటున్నారు అని విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన విషయంలో జగన్ కోటరీ ఆయనను పూర్తిగా డైవర్ట్ చేస్తోంది అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ అలాంటి మాటలు వినరాదని, ఆయన అన్నీ ఆలోంచిచాలని విజయసాయిరెడ్డి హితవు చెప్పారు. అంటే ఒకనాటి జగన్ సహచరుడిగా విజయసాయిరెడ్డి ఆయన మంచి మాటలను వినాలని గట్టిగా కోరుకున్నారు అన్న మాట.
ఏ పార్టీలో లేను :
తన ప్రస్తుత జీవితం పూర్తిగా రైతుగానే అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ప్రయత్నం చేయలేదని అన్నారు. అంతే కాదు తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని కూడా ఆయన చెప్పారు. అయితే తన మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయని ఆయన చెప్పడం విశేషం. మరి ఏ వైపు నుంచి వచ్చాయన్నది ఆయన బయట పెట్టలేదు, కానీ తాను దేనికీ లొంగలేదని ఆయన చెప్పుకున్నారు. ఇక తాను తలచుకుంటే ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తారు అని ఆయన ప్రకటించారు. ప్రస్తుతానికి అయితే రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఏదీ లేదని కానీ తాను అవసరం అయితే పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఆ విషయంలో తాను వెనకాడే ప్రసక్తి కూడా లేదని ఆయన అంటున్నారు.
సైరా నరసింహారెడ్డి జిల్లా :
ఇదిలా ఉంటే ఏపీలో పొట్టి శ్రీరాములు అన్నమయ్య, ఎన్టీఆర్, వైఎస్సార్, ఇలా చాలా మంది ప్రముఖుల పేర్లతో జిల్లాలు ఏర్పాటు అయ్యాయని, కానీ సైరా నరసింహారరెడ్డి పేరుతో మాత్రం జిల్లా లేదని దానిని ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలా చేయడం ద్వారా ఒక స్వాతంత్ర సమరయోధుడిని గౌరవించాలని ఆయన సూచించారు. ఇక శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం భవనం నిర్మాణానికి అయ్యే ఖర్చుని తాను మొత్తం భరిస్తాను అని ఆయన హామీ ఇవ్వడం విశేషం.
పవన్ తో గట్టి దోస్తీ :
తనకు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రెండు దశాబ్దాలుగా స్నేహం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. తాను ఎపుడూ పవన్ ని విమర్శిచినది లేదని ఆయన చెప్పారు. ఇక తన మీద ఎందరో ఎన్నో సెటైర్లు వేస్తున్నారు అని తాను ఎవరు ఏమనుకున్నా ఒక రైతుగా మాత్రమే ప్రస్తుతం ఉన్నాను అని చెబుతూనే అవసరం అయితే పార్టీ పెడతాను అని విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగానే ఉంది.