బొత్సని అల్లల్లాడిస్తున్నారుగా...వెనక ఉన్నది ఎవరో తెలుసా ?
అయితే రాజకీయంగా జూనియర్ అయిన కిమిడి నాగార్జున బొత్సను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.;
విజయనగరం జిల్లాలో పూసపాటి సంస్థానాధీశులను మకుటం లేని మహారాజులుగా చెబుతారు. వారి సంస్థానానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చేంతవరకూ రాజులే సంస్థానాలను ఏలారు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా కొన్ని తరాలను శాసించారు. ఎపుడైతే ప్రజాస్వామిక వ్యవస్థ వచ్చిందో ఆనాటి నుంచి రాజులు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ప్రజలు కూడా వారిని ఇంకా అదే గౌరవ భావంతో గెలిపిస్తూ వస్తున్నారు.
సామాజిక సమీకరణతో :
ఇక మరిన సామాజిక సమీకరణల ప్రభావంతో విజయనగరం జిల్లాలో కీలక నేతలుగా పలువురు ఎదిగారు వారిలో అగ్ర తాంబూలం వైసీపీ నేత, శాసనమండలి లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు ఇవ్వాలి. ఆయనది మూడు దశాబ్దాలకు పైబడిన చరిత్ర. ఆయన 1989లోనే విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు, అయితే 1992లో ఆయనకు డీసీసీబీ పీఠం దక్కింది దాంతో బొత్స అధికార రాజకీయం మొదలైంది. ఇక ఆయన తొలిసారిగా 1999లో ఎన్నికల్లో పోటీ చేశారు అలా ఆయన బొబ్బిలి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. 2004కి వచ్చేసరికి వైఎస్సార్ తో పెంచుకున్న అనుబంధం ఆయనకు రాజకీయంగా జిల్లాలో తిరుగులేకుండా చేసింది.
మంత్రిగా రికార్డు :
బొత్స 2004 నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేశారు. అంతే కాదు ఆయన ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ కి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. అదే విధంగా ఆయన జగన్ కేబినెట్ లో అయిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. ఇలా ఉత్తరాంధ్రా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన వారిగా తనకంటూ ఒక రికార్డు క్రియేట్ చేసుకున్నారు. రాజకీయంగా ఎప్పటికపుడు ఎత్తులు వేయడంలో బొత్సకు తిరుగులేదని అంటారు. ఆయనకు అన్ని పార్టీలలో స్నేహితులు ఉన్నారని కూడా చెబుతారు. ఆయన ఒక విధంగా ఈ రాకమైన స్నేహ బంధాలతో తిరుగులేని రాజకీయాన్ని జిల్లాలో చలాయిస్తున్నారు.
జూనియర్ తో సవాల్ :
అయితే రాజకీయంగా జూనియర్ అయిన కిమిడి నాగార్జున బొత్సను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన 2019లో చీపురుపల్లి నుంచి తొలిసారి పోటీ చేసిన నాగార్జున మీద బొత్స మంచి విజయం సాధించారు. అయితే పట్టుదలగా పనిచేస్తూ చీపురుపల్లిలో నాగారజున తనకంటూ బలాన్ని సొంతంగా సాధించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి బొత్సను ఓడించాలని నాగార్జున ఎంతగానో ఆలోచించారు కానీ చివరి నిముషంలో పెదనాన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అక్కడికి షిఫ్ట్ కావడంతో నాగార్జున ఆయనకు సహాయం చేసి గెలిపించారు. దానికి ప్రతిఫలంగా ఆయనకు డీసీసీబీ పీఠం వంటి కీలక పదవిని టీడీపీ అధినాయకత్వం అప్పగించింది.
కోట నుంచి మారుతోంది :
పూసపాటి అశోక్ గజపతిరాజు క్రియాశీలకంగా ఉన్నపుడు రాజకీయం అంతా కోట కేంద్రంగా సాగేది. ఆయన 2019లో ఓటమి తరువాత మెల్లగా యాక్టివిటీస్ తగ్గించేశారు. దాంతో సమయానికి నాగార్జున అందుకున్నారు. నాడు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నాగార్జున వ్యవహరిస్తూ పార్టీని పటిష్టం చేశారు. ఇపుడు చూస్తే గోవాకు గవర్నర్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వెళ్ళిపోయారు. దాంతో నాగార్జునను అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన యువనేతగా ఆయన ఉన్నారు. దాంతో సహజంగానే ఆయనను ముందుంచి జిల్లా టీడీపీ రాజకీయాలను ఒక కొలిక్కి తేవాలని చూస్తున్నారు.
లోకేష్ ఫోకస్ :
విజయనగరం జిల్లా రాజకీయాల్లో అధికారం టీడీపీకి ఉన్నా వైసీపీ బలంగా ఉంది. పైగా వైసీపీ టీడీపీల మధ్య క్షేత్ర స్థాయిలో ఒక అవగాహన ఉందని ప్రచారం సాగుతోంది. దీని వల్లనే పార్టీ గెలిచినా కూడా తన ప్రభావం చూపించలేకపోతోంది అని అంటున్నారు. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన ప్రభంజం చూపించాలంటే బొత్స తో పాటు వైసీపీ ప్రాభవం గణనీయంగా తగ్గించాలని కూడా టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది లోకేష్ ఈ విషయంలో పట్టుదలతో ఉండడంతో బొత్స రాజకీయం అల్లల్లాడుతోంది అని అంటున్నారు. అధికారంలో పార్టీ ఉందా లేదా అన్న విషయాలతో సంబంధం లేకుండా హవా చలాయించే బొత్సకు తాజాగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో షాక్ తగిలింది అంటే దాని వెనక భారీ స్కెచ్ ఉందని అంటున్నారు. ఇదే దూకుడుతో రానున్న రోజులల్లో బొత్సను కట్టడి చేసే ప్రణాళిక కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ జిల్లా రాజకీయాల్లో ఏమి జరుగుతుందో.